టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. గతంలో తన టెలిఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని.. ఒక్క టెలిఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన లొకేషన్ కూడా ట్రాక్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు న్యాయ మూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. గతంలో తనకు వచ్చిన కష్టమే.. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy)కి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి దృష్టికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకువెళ్లాలని సూచించారు. ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లే కాకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
విశాఖలో రాష్ట్ర రాజధాని అంటూ పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. ఒక్క విశాఖ మాత్రమే రాజధాని అని ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు. సీఎం చేసిన ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన లేకపోవడంతో రాయలసీమ ప్రాంత ప్రజలు ఆగ్రహిస్తారని కొంతమంది హైలైట్ చేయకపోవచ్చు అన్నారు. గతంలో రాష్ట్రం మధ్యలోనే రాజధాని ఉండాలని చెప్పిన జగన్.. అమరావతిలో స్థానికంగా పుష్కలంగా నీళ్లు, భూమి ఉన్నాయని కూడా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు.
విశాఖపట్నం రాజధానిగా ప్రకటించడం పట్ల రాయలసీమ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. అనంతపురం ప్రజలు బెంగళూరు నుంచి అమెరికాకు వెళ్లడానికి ఎంత అయితే సమయం పడుతుందో, అదే అనంతపురం ప్రజలు బస్సులో, రైలు లో విశాఖపట్నం వెళ్లడానికి కూడా అంతే సమయం పడుతుందంటూ రాయలసీమ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉందన్నారు రఘురామకృష్ణ రాజు. రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్న జగనన్న గృహాలు కేంద్ర బడ్జెట్ కేటాయింపులతోనైనా వేగం పుంజుకుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతులు, పేదలు, మధ్య తరగతి వర్గాలతో పాటు, ఎగువ మధ్య తరగతి వర్గాలకు కూడా మేలు చేసే నిర్ణయాలను బడ్జెట్లో తీసుకోవడం జరిగిందన్నారు.