గౌతమ్ అదానీ ఇజ్రాయెల్‌లోని హాయిఫా పోర్టు కోసం ఎందుకంత భారీగా ఖర్చు చేశారు?

ఇజ్రాయెల్‌లోని రెండో అతిపెద్ద పోర్టు హాయిఫాను ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దక్కించుకున్నారు.

ఈ ఒప్పందంపై స్పందిస్తూ భారత్-ఇజ్రాయెల్ సంబంధాల్లో ఇది ఒక కీలక ఘట్టమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతామని గౌతమ్ అదానీ చెప్పారు.

అదానీ గ్రూపు ‘స్టాక్ మానిప్యులేషన్’, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందంటూ అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ ఇటీవల ఒక నివేదిక విడుదల చేయడంతో భారీగా ఈ గ్రూపు కంపెనీ షేర్లు పతనం అవుతున్న సమయంలో ఈ తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఇజ్రాయెల్‌లో రెండో అతిపెద్ద పోర్టును అదానీ గ్రూపు దక్కించుకోవడంపై మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు భారత్ నుంచి వెళ్లిన విదేశీ పెట్టుబడుల్లో ఇవే అత్యధికం. మరోవైపు గత పదేళ్లలో ఇజ్రాయెల్‌లో ఇవే గరిష్ఠ విదేశీ పెట్టుబడులుగా వార్తలు వస్తున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టు డెవలపర్, ఆపరేటర్ అయిన అదానీ గ్రూప్ ఈ పోర్టును లీజుకు తీసుకునేందుకు గత ఏడాది జులైలో టెండరు వేసింది.

2054 వరకు ఈ లీజు గడువు ఉంది. దీనిలో 70 శాతం వాటా అదానీ గ్రూప్‌కు, మరో 30 శాతం వాటా ఇజ్రాయెల్ కెమికల్, లాజిస్టిక్స్ కంపెనీ గడైత్‌కు దక్కింది.

 • పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
 • మెదక్: తన పేరు మీద రూ.7 కోట్లకు బీమా… ‘తన లాంటి వ్యక్తిని చంపేసి, తానే చనిపోయినట్లు నాటకం’

ఈ ఒప్పందంపై గత ఏడాది జులైలో ఇజ్రాయెల్ స్థానిక వార్తా పత్రిక హారెట్జ్ ఒక కథనం ప్రచురించింది.

హాయిఫా పోర్టును అదానీ గ్రూపు దక్కించుకొనేందుకు మరే కంపెనీకి సాధ్యంకాని రీతిలో బిడ్ వేసిందని హారెట్జ్ వివరించింది.

‘‘రెండేళ్ల నుంచీ హాయిఫా పోర్టు కోసం అదానీ గ్రూపు ప్రయత్నిస్తోంది. వీరు బిడ్ ఊహించని విధంగా వేశారు. రెండో స్థానంలోనున్న కంపెనీ కంటే 55 శాతం ఎక్కువగా వీరి బిడ్ ఉంది. ఈ ఒప్పందం ద్వారా 870 మిలియన్ డాలర్లు (రూ.7,122.73 కోట్లు) వస్తుందని ఇజ్రాయెల్ భావించింది. అయితే, ప్రభుత్వ అంచనాల కంటే చాలా ఎక్కువగా దాదాపు 1.18 బిలియన్‌ డాలర్లకు (రూ.9,661 కోట్లు) అదానీ గ్రూపు బిడ్ వేసింది’’అని హారెట్జ్ తెలిపింది.

అదానీ ఆఫర్ గురించి తెలిసిన తర్వాత, స్థానిక కంపెనీలు ఈ బిడ్డింగ్‌ నుంచి ఉపసంహరించుకున్నాయి.

ఈ బిడ్డింగ్ ధరను పరిశీలిస్తే, హాయిఫాను కేవలం ఒక పోర్టుగా కాకుండా, వ్యూహాత్మక పెట్టుబడిగా అదానీ గ్రూపు భావిస్తోందని హారెట్జ్ రాసుకొచ్చింది.

ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌లో జీవించే భారత జర్నలిస్టు హరేంద్ర మిశ్రా మొదట్నుంచీ పరిశీలిస్తున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడారు.

‘‘ఇది సాధారణ ఒప్పందం కాదు. వ్యూహాత్మక పెట్టుబడి. అదానీ గ్రూపు భారీ బిడ్డింగ్‌ను చూసి స్థానిక కంపెనీలతోపాటు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయింది. ఇంత భారీగా అదానీ గ్రూపు బిడ్ వేయడానికి ఏదో ఒక కారణం ఉండొచ్చు’’అని ఆయన చెప్పారు.

 • పాకిస్తాన్ ఆర్ధికంగా దివాలా తీస్తుందా, చేతిలో డాలర్లున్నా ఖర్చు చేయలేని స్థితిలో ఎందుకు పడింది?
 • వేణుగోపాల్ ధూత్: ఇంటింటికీ కలర్ టీవీని తీసుకెళ్లిన వీడియోకాన్ ఎలా ‘పతనమైంది’?

‘‘చైనా భయం.. అమెరికా ఒత్తిడి’’

భారత్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన 13 పోర్టులు అదానీ గ్రూపు చేతిలో ఉన్నాయి. నౌకా రంగం నుంచి వస్తున్న మొత్తం ఆదాయంలో గ్రూపు వాటా 24 శాతం వరకు ఉంది.

అయితే, పశ్చిమ ఆసియాలో అదానీ ఆధీనంలో ఎలాంటి పోర్టులూ లేవు.

హాయిఫా పోర్టు అదానీకి దక్కడంతో ఆసియా, ఐరోపాల మధ్య నౌకా రవాణా పెరుగుతుందని, మధ్యధరా సముద్రంలో ప్రధాన సంస్థగా అదానీ గ్రూపు మారే అవకాశముందని చాలా విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ ఒప్పందం తుది దశకు వచ్చినప్పుడు అదానీ ఓ ట్వీట్ చేశారు. ‘‘దౌత్యపరంగా ఈ ఒప్పందానికి చాలా ప్రాధాన్యముంది. హాయిఫా మాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే 1918లో భారత సైనికులు పోరాడారు’’అని ఆయన ట్వీట్ చేశారు.

జులై 14న ఇజ్రాయెల్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చారు. అప్పుడే ఇక్కడ ఒక సదస్సు చోటుచేసుకుంది. దీనిలో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని యాయెర్ లాపిడ్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూఏఈ పాలకుడు మహమ్మద్ బిన్ జాయెద్ పాల్గొన్నారు.

ఈ సదస్సును ఐ2యూ2గా పిలుస్తున్నారు. నాలుగు దేశాల మధ్య పెట్టుబడుల సహకారాన్ని పెంచడమే దీని లక్ష్యం. పాకిస్తాన్, ఇరాన్‌లతో కలిసి చైనా ఏర్పాటుచేస్తున్న కూటమికి పోటీగా దీన్ని చెబుతున్నారు.

 • క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశచూపి రూ. 4,690 కోట్లు కొట్టేశారు
 • క్రిప్టో ఎక్స్‌చేంజ్ సంస్థ ఎఫ్‌టీఎక్స్ పతనానికీ, భారత సంతతి వ్యక్తి నిషాద్ సింగ్‌కు సంబంధం ఏంటి?

ఈ సదస్సు పూర్తయిన కొన్ని గంటలకే అదానీ గ్రూపు బిడ్‌ను ఇజ్రాయెల్ ఆమోదించింది. ‘‘నాలుగు దేశాల నాయకులు సమావేశమైన కొన్ని గంటలకే ఈ పోర్టు అదానీకి దక్కింది. ఈ విషయంలో ఇజ్రాయెల్‌పై అమెరికా చాలా ఒత్తిడి చేసిందని, చైనాకు ఈ పోర్టు అసలు దక్కకుండా చూడాలని ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి’’అని మిశ్ర తెలిపారు.

జూలై 2019లో హాయిఫాకు సమీపంలోని మరో పోర్టును చైనా 25 ఏళ్ల లీజుకు తీసుకుంది.

ఈ ఒప్పందం అమెరికా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎందుకంటే అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి.

ఆఫ్రికా, తూర్పు ఆసియా తరహాలోనే ఇజ్రాయెల్‌లోనూ చైనా ప్రాబల్యం పెరుగుతుందేమోనని అమెరికాలో ఆందోళన వ్యక్తమైంది. జాతీయ భద్రత సహా చాలా అంశాల్లో అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి మద్దతు అందిస్తోంది.

‘‘ఈ ఒప్పందం వెనుక అమెరికా ఉంది. ఎందుకంటే ఇక్కడ చైనాకు ఎలాంటి ప్రాబల్యం దక్కకూడదని అమెరికా భావించింది. చైనాతో ఎలాంటి ఒప్పందాలు కుదర్చుకోవద్దని ఇజ్రాయెల్‌కు అమెరికా తరచూ చెప్పేది. అయితే, టెండర్ సమయంలో వేరే ఎవరూ రాకపోతే, బిడ్ వేసిన వాళ్లకే ఇస్తామని ఇజ్రాయెల్ చెబుతూ వచ్చింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒప్పందం చైనాకు వెళ్లకుండా అమెరికా జాగ్రత్త వహించింది. మరోవైపు భారత్ కూడా ఇజ్రాయెల్‌కు స్నిహితమైన దేశమే. ఇక్కడ చైనా ప్రాబల్యంతో భారత్‌కు కూడా ముప్పే’’అని మిశ్ర చెప్పారు.

 • అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభాల నుంచి మన పెట్టుబడిని ఎలా రక్షించుకోవాలి?
 • Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?

గత దశాబ్దంలో అత్యధికం ఇవే..

ఇజ్రాయెల్‌లో గత దశాబ్దంలో ఇవే అత్యధిక పెట్టుబడులని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ పోర్టు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఉంది. ఆసియా, యూరప్‌ల మధ్య మధ్యధరా సముద్రంలో ఇది కీలక హబ్‌గా మారే అవకాశముంది. దీని వల్ల సూయజ్ కెనాల్‌పైనా ఒత్తిడి తగ్గే అవకాశముందని కూడా వార్తలు వస్తున్నాయి.

‘‘ఇది హబ్‌గా మారాలంటే, ఇజ్రాయెల్‌తోపాటు లెబనాన్, జోర్డాన్, సిరియా లాంటి దేశాల సహకారం కూడా అవసరం. అయితే, ఈ దేశాలతో ఇజ్రాయెల్‌కు సంబంధాలు సరిగా లేవు. ఇప్పుడు భారత్‌కు ఈ ప్రాజెక్టును అప్పగిస్తే, ఈ దేశాల మధ్య సంబంధాలు కాస్త గాడినపడే అవకాశముంది’’అని మిశ్ర చెప్పారు.

హాయిఫాను అనుసంధానిస్తూ అదానీ గ్రూపు ఒక రైలు మార్గాన్ని కూడా ఇక్కడ నిర్మించబోతోందని, ఇది జోర్డాన్ మీదుగా హాయిఫాను సౌదీ అరేబియాకు కలుపుతుందని వార్తలు వస్తున్నాయి.

 • మ్యూచువల్ ఫండ్స్‌: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
 • ఫిక్సిడ్ డిపాజిట్ల వల్ల ఎలా నష్టపోతాం, ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఏమిటి?

చారిత్రక నేపథ్యం..

గత మంగళవారం గౌతమ్ అదానీ సమక్షంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ మాట్లాడారు. ఈ ఒప్పందం చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు.

‘‘ఈ నగరానికి శత్రు సేనల నుంచి వందేళ్ల క్రితం భారత సైనికులు విముక్తి కల్పించారు. మళ్లీ నేడు ఆర్థికంగా ఇజ్రాయెల్ బలోపేతం అయ్యేందుకు భారత్ కృషి చేస్తోంది’’అని ఆయన అన్నారు.

ఏటా సెప్టెంబరు 23న ఇజ్రాయెల్ హాయిఫా డేను నిర్వహిస్తారు. వందేళ్ల క్రితం ఇక్కడ మరణించిన భారత సైనికులకు కూడా ఆ రోజు నివాళులు అర్పిస్తారు.

1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో హాఫియా నగరానికి తుర్కియా, జర్మన్ సేనల నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పోరాడిన భారత సేనలు విముక్తి కల్పించాయి.

ఇవి కూడా చదవండి:

 • కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా… ఆ రోజు ఏం జరిగింది
 • అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
 • నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి… నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
 • దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
 • పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250… ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *