నటి పాకీజాకి మెగాస్టార్ ఆర్ధికసాయం.. బ్రహ్మానందం గురించే చర్చ

నటి పాకీజాకు ‘మెగా’ సాయం అందింది. ఇటీవల సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన దీన స్థితిని చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించానని ఇప్పుడు తనకి తినడానికి తిండి లేదని.. ఎవరైనా పదిరూపాయిలు సాయం చేస్తే ప్లేట్ ఇడ్లీ తిని అయినా బతుకుదాం అనే దీన స్థితిలో ఉన్నానని చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది నటి పాకీజా. ఆమె అసలు పేరు వాసుకి అయినప్పటికీ అందరికీ పాకీజాగానే పరిచయం.

అసెంబ్లీ రౌడీ చిత్రంలో బ్రహ్మానందం కాంబోలో పాకీజాగా ఆమె చేసిన కామెడీ ప్రేక్షకుల్ని పొట్టచెక్కలు చేసింది. ఆ తరువాత అనేక చిత్రాల్లో నటించింది వాసుకి. అయితే రాను రాను.. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పాటు.. ఆర్ధికంగా చితికిపోవడంతో వాసుకి రోడ్డున పడింది. ఏదైనా పని చూసుకునే ఓపిక కూడా లేకపోవడంతో ఆమెకు కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలోకి వచ్చేసింది.

ఆ మధ్య అలీతో సరదాగా కార్యక్రమంలో కనిపించిన వాసుకిని రీసెంట్‌గా సుమన్ టీవీ యాంకర్ రోషన్ ఇంటర్వ్యూ చేయడంతో ఆమె ఎంత దీన స్థితిలో ఉన్నారో అందరికీ తెలిసింది. దీంతో మెగా బ్రదర్ నాగబాబు తొలిసారిగా స్పందిస్తూ.. రోషన్‌కి కాల్ చేసి మరీ.. వాసుకికి లక్ష రూపాయల ఆర్ధికసాయం అందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందిస్తూ.. పాకీజాకు లక్ష రూపాయిల ఆర్ధికం సాయం అందించారు. ఈ సందర్భంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి వాసుకి అలియాస్‌ పాకీజాకి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించాలి.. సినిమాలు సీరియల్స్‌లో ఆమెకు పాత్రల్ని ఇచ్చి ఆర్ధికంగా సాయం చేయాలన్నారు మెగాస్టార్.

అయితే పాకీజా పేరు చెప్తే గుర్తొచ్చే పేరు సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం. వీళ్లిద్దరి కాంబోకి ప్రేక్షకులు పడి పడి నవ్వుకునేవారు. తన తోటి నటి తిండికి దిక్కులేక ఇబ్బందుల్లో ఉంటే.. బ్రహ్మానందం లాంటి కోటీశ్వరుడైన కమెడియన్ స్పందించి ఆమెకు ఆర్ధికసాయం అందిస్తే బాగుంటుందని చాలామంది కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. కోట్ల సంపాదించాడు.. తన తోటి నటి ఆపదలో ఉంటే సాయం చేయడానికి చేతులు రావడం లేదా? అని కొంతమంది అయితే బ్రహ్మనందంపై ఫైర్ అవుతున్నారు. మరి బ్రహ్మానందం స్పందిస్తారో లేదో చూడాలి మరి.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *