‘మైఖేల్’ ప్రీమియర్ షో టాక్: సందీప్ కిషన్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ.. ఇంటర్వెల్ మైండ్ బ్లాక్!

‘ప్రస్థానం’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ (Sundeep Kishan).. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీతో హీరోగా కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఆ తరవాత వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వచ్చినా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ స్థాయి విజయాన్ని సందీప్ కిషన్ అందుకోలేకపోయారు. జయాపజయాలను పక్కనపెడితే రకరకాల జోనర్లలో సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చారు సందీప్. ఈ క్రమంలో 2019లో తానే నిర్మాతగా, హీరోగా ‘నిను వీడని నీడను నేనే’ సినిమాను నిర్మించారు. ఇది హిట్ అయ్యింది. ఆ తరవాత కొండంత ఆశతో హాకీ నేపథ్యంలో ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా చేశారు. కానీ, ఇది నిరాశపరిచింది. ‘గల్లీ రౌడీ’ కూడా ఆకట్టుకోలేకపోయింది.

అయితే, ఇటు తెలుగు అటు తమిళంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న సందీప్ కిషన్.. ఈసారి ఎలాగైనా హిట్టు గట్టిగా కొట్టాలని ‘మైఖేల్’ ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకున్నారు. కథపై ఉన్న నమ్మకంతో పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా రంజిత్ జయకోడి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. ఆయనకు భార్యగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించారు. ఇంకా వరుణ్ సందేశ్, స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది.

సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు అంటే ఈరోజు సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో వేశారు. ఈ షోను రానా దగ్గుబాటి, తేజ సజ్జా, డైరెక్టర్ నందిని రెడ్డి, నిర్మాత అనిల్ సుంకర తదితరులు వీక్షించారు. సినిమా చూసిన తరవాత వీరంతా ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇది సందీప్ కిషన్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అని రానా దగ్గుబాటి అన్నారు.

‘‘ఇప్పటి వరకు ఇది నీ ఉత్తమమైన సినిమా సందీప్ కిషన్. మైఖేల్ డైరెక్టర్ రంజిత్ జయకోడికి, అద్భుతమైన మొత్తం నటీనటులు, టెక్నీషియన్లకు నా అభినందనలు. రేపు దుమ్ములేపండి’’ అని రానా దగ్గుబాటి ట్వీట్ చేశారు. దీనికి సందీప్ కిషన్ కూడా స్పందించారు. ‘సమయం కేటాయించి సినిమా చూసినందుకు థాంక్యూ చీఫ్. మీకు సినిమా నచ్చడం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.

యంగ్ హీరో తేజ సజ్జా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘మైఖేల్ భలే క్రేజీ మూవీ. సినిమా ఆద్యంతం నేను ఎంజాయ్ చేశాను. సందీప్ కిషన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయి. దర్శకుడు రంజిత్‌కు అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమలోకి ఆయనకి స్వాగతం. సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

అలాగే, డైరెక్టర్ నందినీ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ‘‘మైఖేల్ అద్భుతంగా ఉంది. రియల్‌గా ఉంది. సందీప్ కిషన్‌కు ఇది మరో కొత్త ప్రయాణం. నిన్ను నువ్వే అధిగమించావు. దర్శకుడు రంజిత్ అద్భుతంగా రాసుకున్నారు, దర్శకత్వం వహించారు. మొత్తం టీమ్‌కు అభినందనలు’’ అని నందినీ రెడ్డి పేర్కొన్నారు.

ఇక నిర్మా అనిల్ సుంకర స్పందిస్తూ.. ‘‘సందీప్ కిషన్ కొత్త సినిమా చూశాను. ఇదొక అద్భుతమైన సెల్యులాయిడ్ ఎక్స్‌పీరియన్స్. ఇంటర్వెల్‌కు ముందు, తరవాత అదిరిపోయింది. విజయ్ సేతుపతి నటన అద్భుతంగా ఉంది. యాక్షన్ మూవీ లవర్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. సందీప్‌‌ను ఈ సినిమా ఒక మెట్టు పైకి ఎక్కిస్తుంది. 90ల రీక్రియేషన్ బాగా చేశారు’’ అని పేర్కొన్నారు. మొత్తం మీద విడుదలకు ముందే ‘మైఖేల్’కు పాజిటివ్ టాక్ వచ్చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *