పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తు అందించేందుకు తల్లిదండ్రులు జీవితాంతం కష్టపడుతుంటారు. వారి భద్రత కోసం అనుక్షణం ఆలోచిస్తుంటారు. ఎటువంటి ప్రమాదం ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అందరూ ఆశ్చర్యపోయే ఓ ఘటన ఇజ్రాయెల్‌లో చోటుచేసుకుంది. విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన జంట తమ బిడ్డకు కూడా టికెట్ కావాలని తెలియడంతో.. బిడ్డను అక్కడే వదిలి ప్రయాణించేందుకు సిద్ధమైంది. ఈ ఘటను తెలుసుకున్న ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అవాక్కయింది. వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* బిడ్డను వదిలి ప్రయాణానికి సిద్దం
ఓ కుటుంబం బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెల్జియంలోని బ్రస్సెల్స్‌కు వెళ్లేందుకు ర్యాన్‌ఎయిర్ విమానం టిక్కెట్లు బుక్ చేసుకుంది. ఆ జంట తమ కుమారుడితో పాటు ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడకు వెళ్లగానే బిడ్డకు కూడా టికెట్ కావాలని తెలిసింది. బిడ్డకు టికెట్ లేకపోవడంతో ఆ జంట వెనుదిరగలేదు. బిడ్డను చెక్ ఇన్ వద్ద వదిలేసి పాస్‌పోర్ట్ కంట్రోల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ప్రయాణానికి సిద్ధమ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది అవాక్కయ్యారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
* ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు!
ఈ విషయం గురించి ర్యాన్‌ఎయిర్ విమానాశ్రయం డెస్క్ మేనేజర్ మాట్లాడుతూ.. మేము ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. జరిగిన విషయాన్ని అసలు నమ్మలేకపోతున్నాం అని తెలిపారు.
ర్యాన్‌ఎయిర్ ప్రతినిధి CNNతో మాట్లాడుతూ.. టెల్ అవీవ్ నుంచి బ్రస్సెల్స్‌కు ప్రయాణిస్తున్న భార్యభర్తలు తమ బిడ్డకు టికెట్ బుకింగ్ లేకుండా చెక్-ఇన్ అయ్యారని చెప్పారు. చెక్-ఇన్ వద్ద బిడ్డను వదిలేసి సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకోవడానికి ముందుకెళ్లారని పేర్కొన్నారు. బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌లోని చెక్-ఇన్ ఏజెంట్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీని సంప్రదించారని, వారు ఈ ప్రయాణీకులను తిరిగి రప్పించారని తెలిపారు. ఈ విషయం ఇప్పుడు స్థానిక పోలీసుల వద్ద ఉందని వివరించారు.
* తల్లిదండ్రులకు బిడ్డను అప్పగించిన పోలీసులు
ర్యాన్‌ఎయిర్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. శిశువులను ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రయాణించేందుకు వారికి వన్-వే విమానానికి 27 డాలర్లు(దాదాపు రూ.2,200) ఛార్జీ ఉంటుంది. ఒకవేళ బిడ్డకు కార్ సీట్ అవసరమని భావిస్తే టికెట్‌కి అవసరమైన మొత్తం చెల్లించాలి. సమస్య పరిష్కారమైందని, ఇప్పుడు బిడ్డ తల్లిదండ్రుల వద్దే సురక్షితంగా ఉందని ఇజ్రాయెల్ పోలీసు ప్రతినిధి CNNతో తెలిపారు.
దంపతులు టెర్మినల్ 1కి ఆలస్యంగా చేరుకున్నారని, వారి విమానానికి చెక్-ఇన్ కౌంటర్ క్లోజ్ అయిందని ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ తెలిపింది. సెక్యూరిటీ చెకింగ్ కోసం వెళ్లాలని వాళ్లు భావించి, బిడ్డను కన్వేయర్ బెల్ట్ ప్రాంతంలో వదిలేశారని చెప్పారు.