అదానీకి మరో ఝలక్.. డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న మాజీ ప్రధాని సోదరుడు

అదానీ గ్రూప్‌‌నకు హిండెన్‌ బర్గ్‌ రిసెర్చ్ నివేదిక సెగ కొనసాగుతోంది. తాజాగా, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు లార్డ్ జో జాన్సన్ అదానీ గ్రూప్ నుంచి తప్పుకున్నారు. అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న లండన్‌కు చెందిన ఎలారా క్యాపిటల్ డైరెక్టర్ పదవికి జో జాన్సన్ రాజీనామా చేశారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవీ)తో ముడిపడి ఉన్న యూకే పెట్టుబడి సంస్థ ఎలారా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ పదవి నుంచి జో జాన్సన్ ఫిబ్రవరి 1న తప్పుకున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ ధ్రువీకరించింది.

‘‘యూకే- ఇండియా వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలకు’ సహకరించడానికి ఎలారాలో చేరాననీ, అప్పటికి సంస్థ ఉన్నతస్థితిలో ఉందని తనకు హామీ ఇచ్చారనీ జాన్సన్ తెలిపారు. ఎలారా క్యాపిటల్ చట్టపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉందని, కానీ, ఆర్థిక నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక రంగాలలో ఎక్కువ నైపుణ్యం అవసరమని భావించి బోర్డుకు రాజీనామా చేసినట్టు జో పేర్కొన్నారు.

భారతీయ కార్పొరేట్లకు నిధులను సమీకరించే క్యాపిటల్ సంస్థగా ఎలారా చెప్పుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీవోలోని 10 బుక్‌రన్నర్‌లలో ఇది కూడా ఒకటి. జో జాన్సన్ గత ఏడాది జూన్‌లో ఎలారా క్యాపిటల్ పిఎల్‌సీకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ సంస్థను 2002లో క్యాపిటల్ మార్కెట్ వ్యాపారంగా రాజ్‌భట్ స్థాపించారు. గ్లోబల్ డిపాజిటరీ రసీదు, ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్, లండన్ ఏఐఎం మార్కర్ ద్వారా భారతీయ కార్పొరేట్లకు ఇది నిధులను సమకూరుస్తుంది.

లండన్, న్యూయార్క్, సింగపూర్‌తో పాటు భారత్‌లోని ముంబై, అహ్మదాబాద్‌లలో పూర్తి లైసెన్స్ పొందిన కార్యాలయాలు దీనికి ఉన్నాయి. ఎలారా క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం 2021 వేసవి నాటికి 5.1 శాతం వాటాతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మూడో అతిపెద్ద వాటాదారుగా ఉంది. కాగా, నాటి యూకే ప్రధాని బోరిస్ జాన్సన్.. 2022 ఏప్రిల్‌లో రెండు రోజుల భారత పర్యటనకు వచ్చినప్పుడు గౌతమ్ అదానీని అహ్మదాబాద్‌లో కలిశారు.

Read Latest International News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *