అమెరికా ఆకాశంలో చైనా ‘గూఢచారి బెలూన్’ ఎగురుతోందా?

ఇటీవల అమెరికాలోని కొన్ని ప్రాతాల్లో ఓ బెలూన్ ఎగురుతూ కనిపిస్తోంది. అది చైనా ‘గూఢచారి బెలూన్’ అన్న అనుమానంతో అమెరికా దానిపై నిఘా ఉంచింది.

చాలా ఎత్తులో ఎగురుతున్న ఆ బెలూన్ కచ్చితంగా చైనాకు చెందినదేనని విశ్వసిస్తున్నట్టు అమెరికా రక్షణ అధికారులు చెబుతున్నారు. తాజాగా ఈ బెలూన్ పశ్చిమం వైపున్న మోంటానా రాష్ట్రంపై ఎగురుతూ కనిపించింది.

ఆ బెలూన్‌ను షూట్ చేస్తే, ముక్కలు కిందపడి హాని కలిగిస్తాయని భావిస్తున్నారు.

నిజానిజాలు బయటపడేవరకు ఊహాగానాలకు, దాని చుట్టూ ప్రచారాలకు దూరంగా ఉండాలని చైనా హెచ్చరిస్తోంది.

నిఘా బెలూన్ బుధవారం మోంటానాలోని బిల్లింగ్స్ నగరంలో కనిపించడానికి ముందు అలస్కాలోని అలూటియన్ దీవుల మీదుగా, కెనడా గుండా ప్రయణించిందని అమెరికా అధికారులు తెలిపారు.

ఆ బెలూన్‌ను షూట్ చేయమని వైట్ హౌస్ ఆదేశిస్తే, అందుకు ఫైటర్ జెట్స్‌ను సిద్ధం చేసి ఉంచామని రక్షణ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ బెలూన్ కెనడాలో రెండవసారి కనిపించిందని శుక్రవారం ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. అయితే, దీని వెనుక ఎవరి హస్తం ఉందన్న దానిపై ఏమీ చెప్పలేదు.

“విదేశీ నిఘా ముప్పు నుంచి కెనడాకు చెందిన సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి” అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని కెనడా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ముప్పును అంచనా వేయడానికి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ మార్క్ మిల్లీ సహా ఉన్నత సైనికాధికారులు బుధవారం సమావేశమయ్యారు.

  • అమెరికా టెక్నికల్ సీక్రెట్స్‌ను చైనా ఎలా దొంగిలిస్తోంది? స్టెగనోగ్రఫీ అంటే ఏంటి?
  • ‘‘నీ మీద క్షపణి పేల్చటం నిమిషం పని’ అని పుతిన్ నన్ను బెదరించారు’’ – బోరిస్ జాన్సన్

చైనా నిఘా సమాచారం సేకరిస్తోందా?

మోంటానా తక్కువ జనాభా కలిగిన ప్రాంతం. ఇది అమెరికాలోని మూడు అణు క్షిపణి జోన్లలో ఒకటి. ఈ క్షిపణి క్షేత్రం మాల్మ్‌స్ట్రోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఉంది.

నిఘా బెలూన్ సమాచారాన్ని సేకరించేందుకే సున్నితమైన ప్రాంతాలపై ఎగురుతున్నట్టు అనుమానిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఈ స్పై బెలూన్‌ను గాల్లోనే మట్టుపెడితే శిథిలాలు నివాస ప్రాంతాలపై పడి, ప్రజలకు హాని కలిగించవచ్చని ఆర్మీ అధికారులు సూచించారు. అందుకే బెలూన్‌ను షూట్ చేయకూడదని నిర్ణయించుకున్నారు.

అయితే, బెలూన్ ఎంత పెద్దదన్న విషయం అధికారులు బయటపెట్టలేదు. కానీ, విమానంలో ఉన్న పైలట్స్ దూరం నుంచి దాన్ని చూడగలుగుతున్నారని చెప్పారు.

మూడు బస్సులు కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో ఈ బెలూన్ కూడా అంత పెద్దగా ఉందని ఒక అమెరికా అధికారి తెలిపినట్టు స్థానిక మీడియాలో రిపోర్టులు వచ్చాయి.

కాగా, ఈ బెలూన్ వల్ల “ముప్పు పెరుగుతోందన్న” ఆందోళన లేదని, అమెరికా అధికారులకు “ఆ బెలూన్ కచ్చితంగా ఎక్కడెక్కడ ఎగురుతోందో, ఏ మార్గాల గుండా ప్రయాణిస్తోందో తెలుసునని” రక్షణ శాఖ తెలిపింది.

అలాగే, పౌర విమానాలకు ఏ ప్రమాదమూ లేదని, కమర్షియల్ విమానాలు ఎగిరే ఎత్తుకు చాలా పైన స్పై బెలూన్ ఎగురుతోందని తెలిపింది.

చైనా ఇప్పటికే శాటిలైట్లను ఉపయోగించి సేకరిస్తున్న సమాచారం కంటే ఈ బెలూన్ ఎక్కువ సమాచారం అందించే అవకాశాలు తక్కువని రక్షణ శాఖ పేర్కొంది.

వాషింగ్టన్‌లో చైనా రాయబార కార్యాలయానికి, బీజింగ్‌లో అధికారులకు ఈ నిఘ బెలూన్‌కు సంబంధించిన సమాచారం అందించామని, చైనా అధికారులతో చర్చిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు.

  • అమెరికా జైలు నుంచి విడుదలైన ‘క్వీన్ ఆఫ్ క్యూబా’ – ఎవరీ గూఢచారి? అమెరికాకు ఎలా నష్టం చేశారు

చైనా ఏమంటోంది?

చైనా ప్రస్తుతం నిఘా బెలూన్‌పై వస్తున్న నివేదికలను ధ్రువీకరించడానికి ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు.

“వాస్తవాలు తెలిసేవరకు, దీని చుట్టూ కథనాలు అల్లడం, ప్రచారాలు కల్పించడం వల్ల సమస్య పరిష్కారం కాదని” ఆమె అన్నారు.

“చైన ఒక బాధ్యతాయుతమైన దేశం. అంతర్జాతీయ చట్టాలను కచ్చితంగా పాటిస్తుంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతర దేశాల భూభాగంలో లేదా గగనతలంలో తిరిగే ఉద్దేశం మాకు లేదు” అని మావో నింగ్ అన్నారు.

ఈ నిఘా బెలూన్‌పై చర్చించేందుకు గురువారం మరోసారి అమెరికా అధికారులు సమావేశమయ్యారు. అయితే, ప్రస్తుతం స్పై బెలూన్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి దీన్ని ప్రారంభించారన్న విషయాలపై ఎలాంటి సమాచారం అందించలేదు.

ఇలాంటి నిఘా బెలూన్లను గతంలోనూ చూసామని, కానీ ఇది “గతంలో వాటి కంటే ఎక్కువకాలం ఆకాశంలో ఎగురుతోందని” అధికారులు తెలిపారు.

మోంటానాలో ప్రజలు ఈ బెలూన్‌ను చూసి తికమకపడుతున్నారు. దీని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆకాశంలో చాలా ఎత్తులో ఏదో గుండ్రని వస్తువు ఎగురుతున్నట్టు ఆ ఫొటోల్లో తెలుస్తోంది.

ఆ బెలూన్‌ను పర్యవేక్షిస్తున్న అమెరికా మిలటరీ విమానాలను ఆకాశంలో చూశామని మరికొందరు చెప్పారు.

“తెల్లగా గుండ్రని వస్తువు ఆకాశంలో కనిపించింది. అది యూఎఫ్ఓ అనుకున్నా. ఇంటికెళ్లి మంచి కెమేరా తెచ్చి దానికి చాలా ఫొటోలు తీశా” అని బిల్లింగ్స్ ఆఫీస్ వర్కర్ చేజ్ డోక్ చెప్పారు.

అమెరికా తరచూ ప్రచ్చన్న యుద్ధానికి కాలు దువ్వుతూ చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోందని చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

చైనా మీడియాలో కూడా ఈ బెలూన్ గురించి అనేక నివేదికలు వస్తున్నాయి. నిఘా కోసం బెలూన్లను ఉపయోగిస్తారన్న విషయం కొత్తగా తెలిసిందంటూ సోషల్ మీడియాలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  • అమెరికా సహా పలు దేశాల్లో చైనా సీక్రెట్ పోలీస్ స్టేషన్‌లు, ఇక్కడ ఏం చేస్తారు?

‘చైనా నిఘా తీవ్రమవుతోంది’

అమెరికా ప్రభుత్వంలోని రిపబ్లికన్లు చైనా నిఘా చర్యలను ఖండించారు.

సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీలోని టాప్ రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో చైనా నిఘా బెలూన్‌ను నిందించారు.

“గత ఐదేళ్లల్లో చైనా మన దేశంపై పెట్టిన నిఘా తీవ్రంగా మారుతోందని” ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

“ఈ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని” తనకు నివేదికలు వచ్చినట్టు మోంటానా గవర్నర్, రిపబ్లికన్ గ్రెగ్ జియాన్‌ఫోర్టే అన్నారు.

“ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న అతిపెద్ద భౌగోళిక రాజకీయ సవాలు చైనా” అని సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ గురువారం పేర్కొన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వచ్చే వారం చైనా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ గూఢచారి బెలూన్ అంశం ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ క్యాబినెట్‌ సెక్రటరీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.

ఆంటోనీ బ్లింకెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారని ఫైనాషియల్ టైమ్స్ పత్రిక గురువారం తెలిపింది.

కాగా, నిఘా కోసం బెలూన్లను ఉపయోగించడం చాలా పాత పద్ధతి. ఇతర గగనతల నిఘా పరికరాల కంటే, బెలూన్లను తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. మనిషి సాయం అక్కర్లేదు. ఎక్కువకాలం ఆకాశంలో ఎగరగలవు.

ఇవి కూడా చదవండి:

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *