ఆగమవుతున్న అదానీ గ్రూప్…అప్పులపై ఆర్బీఐ ఆరా వెలుగు, బిజినెస్ డెస్క్: హిండెన్‌బర్గ్ రిపోర్టు వచ్చాక అదానీ గ్రూప్ షేర్లు పతనమవడంపై సెబీ ఇప్పటికే ఆరా తీస్తుండగా, తాజాగా దేశంలోని బ్యాంకులు ఆ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన అప్పులపైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరా తీస్తోంది. అదానీ గ్రూప్‌కు ఏ బ్యాంకు ఎంతెంత అప్పులు ఇచ్చిందో వివరాలు చెప్పమని ఆర్బీఐ కోరినట్లు ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్ ఒకరు గురువారం వెల్లడించారు. మరోవైపు పార్లమెంట్‌లోనూ అదానీ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి.
ఎస్బీఐ ఇచ్చింది 2.6 బిలియన్ డాలర్లు…
దేశంలోని అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ కంపెనీలకు 2.6 బిలియన్ డాలర్ల మేర అప్పులు ఇచ్చినట్లు సమాచారం. అయితే, అప్పులు–వడ్డీలను అదానీ గ్రూప్ సక్రమంగా చెల్లిస్తున్నందున, ఇప్పటికిప్పుడు ఇబ్బందులేవీ లేవని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా చెప్పారు. ఎంత అప్పు ఇచ్చినదీ చెప్పేందుకు ఎస్బీఐ అఫీషియల్ స్పోక్స్‌పర్సన్ అందుబాటులోకి రాలేదు. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇచ్చిన అప్పులు రూ. 7 వేల కోట్ల దాకా ఉన్నట్లు కిందటి నెలలో ఆ బ్యాంకు సీఈఓ అతుల్ గోయెల్ మీడియాకు చెప్పారు. అదానీ గ్రూప్‌కు తాము ఇచ్చిన అప్పులు తమ మొత్తం అప్పుల్లో 0.1 శాతం కంటే తక్కువేనని ఐడీఎఫ్సీ ఫస్ట్‌బ్యాంక్ గురువారం ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది.
ఆగని షేర్ల పతనం..
షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రిపోర్టు తెచ్చిన రోజు నుంచీ పడుతున్న అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గురువారం ట్రేడింగ్‌లోనూ మరింత పతనమయ్యాయి. అదానీ గ్రూప్ షేర్ల భారీ పతనంతో ఆయా కంపెనీలలోని ఇన్వెస్టర్లు మొత్తం 100 బిలియన్ డాలర్ల దాకా నష్టపోయారు. వరసగా చివరి ఆరు ట్రేడింగ్ సెషన్లలోనూ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్‌విలువ పడుతూనే ఉంది. మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తాజాగా రూ. 10.89 లక్షల కోట్లకు తగ్గిపోయింది. హిండెన్‌బర్గ్ రిపోర్టుకు ముందు ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ. 19.2 లక్షల కోట్లు. దీంతో బ్లూమ్బర్గ్రియల్టైమ్బిలియనీర్ల లిస్టులోనూ, ఫోర్బ్స్ లిస్టులోనూ కూడా గౌతమ్ అదానీ ఇప్పుడు వెనకపడిపోయారు. ముకేశ్ అంబానీ మళ్లీ ముందుకు దూసుకెళ్లారు.
గ్లోబల్ రిచ్‌లిస్టులో కిందటేడాది రెండో ప్లేస్‌కి ఎదిగిన అదానీ సంపద గత ఆరు రోజుల్లో ఆవిరయిపోయింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌తో కొనసాగడం నైతికంగా సరయినది కాదని భావిస్తున్నామని, ఇన్వెస్టర్లందరికీ ఎఫ్‌పీఓ డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నామని బుధవారం రాత్రి గౌతమ్ అదానీ ప్రకటించినా, అది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించలేకపోయింది.
వారంలో అదానీకి అన్నీ ఎదురుదెబ్బలే….
- జనవరి 24….. అదానీ గ్రూప్ షేర్ల మానిప్యులేషన్, ఎకౌంటింగ్ ఫ్రాడ్స్‌కు పాల్పడుతోందంటూ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ 106 పేజీల రిపోర్టు విడుదల. అదానీ గ్రూప్ వివరణ కోరిన ఎంఎస్సీఐ
- జనవరి 29 ….హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిజం కాదంటూ 413 పేజీల స్టేట్మెంట్ విడుదల చేసిన అదానీ గ్రూప్… తామడిగిన అసలు ప్రశ్నలకు జవాబులే వంటూ హిండెన్‌బర్గ్ విమర్శ
- కరిగిపోయిన అదానీ వ్యక్తిగత సంపద….షేర్ల మార్కెట్ విలువ దారుణంగా పతనం కావడంతో గ్లోబల్ టాప్ 10 బిలియనీర్ల లిస్ట్ నుంచి గౌతమ్ అదానీ అవుట్..
- అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు, బాండ్స్‌ను కోలేటరల్గా ఒప్పుకోవడం నిలిపివేసిన క్రెడిట్ సూయెజ్, సిటీ గ్రూప్
- అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ ఎఫ్‌పీఓ కాన్సిల్ ప్రకటన
- యూఎస్ ట్రేడింగ్‌లో డిస్ట్రెస్ లెవెలకు పడిపోయిన అదానీ గ్రూప్ బాండ్లు
- అదానీ గ్రూప్‌లో ఏం జరుగుతోందంటూ ఆరా తీస్తున్న సెబీ, ఆర్బీఐ
అదానీపై ఎన్ఎస్ఈ నజర్..
అదానీ గ్రూప్ కంపెనీలు….అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్లను ఎడిషనల్ సర్విలెన్స్ మార్జిన్ (ఏఎస్ఎం) ఫ్రేమ్‌వర్క్ కిందకి తెస్తున్నట్లు నేషనల్‌స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) గురువారం ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 3 అంటే శుక్రవారం నుంచే అమలులోకి వస్తుందని తెలిపింది. ఏఎస్ఎం కిందకి తేవడం వల్ల ఇంట్రా డే ట్రేడింగ్ చేయాలన్నా 100 శాతం మార్జిన్‌ను ముందే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో స్పెక్యులేషన్‌కు, షార్ట్‌సెల్లింగ్‌కు అడ్డుకట్ట పడుతుంది.
ఇతర గ్రూప్ కంపెనీలు ఎన్డీటీవీ, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు కూడా 5 శాతం పతనమై లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఇంకోవైపు క్రెడిట్ సూయెజ్,
సిటీ గ్రూప్‌లు మార్జిన్ లోన్లకు అదానీ గ్రూప్ షేర్లు, బాండ్స్‌ను కోలేటరల్గా అంగీకరించడం ఆపేశాయి.
©️ VIL Media Pvt Ltd.