Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ఆమెకు మొక్కలు అంటే ప్రాణం.. కానీ తాను నివాసం ఉంటున్న ఇంటి వద్ద మొక్కలు పెంచేందుకు స్థలం లేదు. అప్పుడే యూట్యూబ్ వేదికగా టెర్రస్ గార్డెన్ గురించి తెలుసుకుంది. తెలిసిన పరిచయస్తుల సలహాలు సూచనలతో తన భర్త సహకారంతో తన ఇంటి టెర్రస్ ను గార్డెన్ గా మార్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) పట్టణంలో మిద్దె తోట పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. భద్రాచల పట్టణంలోని రాజరాజేశ్వరి గుడి కాలనీలో నివాసముంటున్న దివ్య వసుంధర ఓ సాధారణ గృహిణి. తన భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో భర్త ఉద్యోగరీత్యా వెళ్ళిన తర్వాత ఖాళీ సమయాల్లో తన ఇంటి వద్ద మొక్కలతోనే తన రోజంతా గడుపుతూ ఉంటుంది.
తన నివాసముంటున్న ఇంటి టెర్రస్ పైన వివిధ రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయలు,అనేక దేశీయ, విదేశీయ కూరగాయల్ని తన డాబాపైనే రసాయన రహిత సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిస్తున్నారు. కుటుంబానికి సరిపడా కూరగాయల్ని తీసుకోని మిగిలిన కూరగాయల్ని ఇరుగు పొరుగువారికి అందిస్తూ ఆనందాన్ని పొందుతుంది దివ్య వసుంధర. తాను పెంచుతున్న మొక్కలు అవసరాలకు కాంపోస్టులు, ఎరువులు సైతం తానే తయారు చేసుకుంటూ టెర్రస్ గార్డెన్ సాగు చేస్తుంది దివ్య వసుంధర.
ఇది చదవండి: వరంగల్ జనానికి కొత్త సమస్య.. ఎటువైపు నంచి వచ్చి పడతాయో..!
ఇదిలా ఉండగా 2018 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇంటి మిద్దెపై మొక్కల సాగును ప్రారంభించిన దివ్య వసుంధర నాటి నుంచి నేటి వరకు కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేస్తూ వస్తుంది. ఇలా దివ్య వసుంధర సాగు గురించి తెలుసుకున్న హార్టికల్చర్ ఉన్నతాధికారులు సైతం తన ఇంటిని సందర్శించి అభినందనలు తెలిపారు.
ఇది చదవండి: ఏజెన్సీలో శాస్త్రీయ నృత్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. ఔరా అనిపిస్తున్న భాగ్యశ్రీ
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు. పట్టణ ప్రాంతాల్లో టెర్రస్ గార్డెన్ ఇప్పుడో సర్వసాధారణ విషయం. ప్రస్తుతం చాల ప్రాంతాల్లోని ప్రజలు మేడపై మొక్కల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు పూల మొక్కలు పెంచుతుంటే మరికొందరు వివిధ రకాల కూరగాయల మొక్కల్ని పెంచుకుంటున్నారు.
ఇంట్లోనే సేంద్రీయ పంటలను పండించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అలవాటు భద్రాచలం లాంటి ఏజెన్సీ ప్రాంతాలకు కూడా అలవాటు అవడం విశేషం. భద్రాచల కేంద్రంగా దివ్య వసుంధర పెంచుతున్న టెర్రస్ గార్డెన్ ను చూసి పలువురు మహిళలు సైతం ఆసక్తి కనపరుస్తూ వారి ఇళ్లపై ఇలా టెర్రస్ గార్డెన్ పెంచేందుకు దివ్య వసుంధర వద్దకు వచ్చి సలహాలు సూచనలు తీసుకుంటున్నట్టు ఆమె న్యూస్ 18 కు తెలిపారు.