అబుదాబీ-కోజికోడ్ ఎయిరిండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలు రావడంతో పైలట్ అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం అబుదాబీ నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కేరళలోని కోజికోడ్‌కు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయి కొద్ది సేపటికే విమానం 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఒకటో నెంబరు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి మంటలు చెలరేగాయి.
దీన్ని గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని అబుదాబీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. ‘‘అబుదాబీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బీ737-800 విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికి 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఒకటో నెంబరు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి మంటలు చెలరేగాయి.. వెంటనే పెలట్ తిరిగి విమానాన్ని అబుదాబీ విమానాశ్రయానికి మళ్లించడంతో ప్రమాదం తప్పింది.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు’’ అని డీజీసీఏ తెలిపింది.
కాగా, ఘటన సమయానికి విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అధికారులు తెలిపారు. ఇటీవల ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. జనవరి 23న తిరువనంతపురం నుంచి రాత్రి 8.30 గంటలకు మస్కట్ బయల్దేరిన విమానంలో 45 నిమిషాల తర్వాత సాంకేతిక లోపం కారణంగా వెనక్కి వచ్చేసింది.
ఇటీవల కోల్‌కతా నుంచి కాలికట్ మీదుగా దుబాయ్‌కు వెళ్లిన ఎయిరిండియా విమానంలో పామును గుర్తించిన విషయం తెలిసిందే. విమానం దుబాయ్‌కు చేరుకున్న తర్వాత గుర్తించారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
Read Latest National News And Telugu News