ఒకేరోజు రెండు సెషన్లలో గ్రూప్ 4 ఎగ్జామ్

ఒకేరోజు రెండు సెషన్లలో గ్రూప్ 4 ఎగ్జామ్

  • 9 లక్షలు దాటిన దరఖాస్తులు
  • నేటితో ముగియనున్న గడువు
  • హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 ఎగ్జామ్ ను జులై 1న నిర్వహించనున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. రెండు సెషన్లలో పరీక్ష​ నిర్వహించనున్నట్టు గురువారం వెల్లడించింది. ఉదయం10 నుంచి 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఎగ్జామ్ ఉంటుందని తెలిపింది. ఆబ్జెక్టివ్ టైప్–ఓఎంఆర్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. గ్రూప్​ 4లో 8,180 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ లో అధికారులు నోటిఫికేషన్​ ఇచ్చారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జనవరి30కే అప్లికేషన్ల గడువు ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 3 వరకూ పెంచారు. గురువారం సాయంత్రం నాటికి మొత్తం 9,15,872 దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటించారు. జనవరి 29, 30 తేదీల్లోనే లక్ష అప్లికేషన్లు వచ్చాయి. జనవరి 28న 34,085, 29న 49,893, 30న 51,846 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత నుంచి ప్రతిరోజూ 15 వేలకు పైగా అప్లికేషన్లు వస్తున్నాయి. శుక్రవారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నది.

    డేట్ల కోసం భారీ కసరత్తు

    గ్రూప్ 4 ఎగ్జామ్ తేదీపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేసింది. ప్రిపరేషన్ కు టైం ఇవ్వాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మూడు, నాలుగు నెలలు ఇవ్వాలని భావించింది. కానీ మేలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన పరీక్షలు, వివిధ కోర్సుల ప్రవేశపరీక్షలు ఉన్నాయి. జూన్ లో పెట్టాలని అనుకున్నా ఆ నెలలో 13 నుంచి 22 వరకూ నెట్ ఎగ్జామ్ ఉండగా, 23 నుంచి 25 వరకూ యూపీఎస్సీ, 24 నుంచి 30 వరకూ సీఏ పరీక్షలు ఉన్నాయి. జులై 2 ఆదివారం పెట్టాలని భావించినా.. ఆ రోజు యూపీఎస్సీ పరీక్ష ఉంది. ఆలస్యం చేస్తే, ఇతర పరీక్షలకూ ఇబ్బందులుంటాయని భావించి.. జులై1న గ్రూప్​ 4 ఎగ్జామ్​ పెట్టాలని నిర్ణయించారు. ఆ రోజు శనివారం వర్కింగ్ డే అయినా, పరీక్ష పెట్టేందుకే మొగ్గుచూపారు.

    3 వేల ఎగ్జామ్​ సెంటర్లు!

    గ్రూప్ 4కు 9 లక్షలకుపైగా అప్లికేషన్లు రావడంతో పరీక్ష నిర్వహణపై టీఎస్పీఎస్సీ ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. స్కూళ్లు, కాలేజీల్లో సెంటర్లను ఏర్పాటు చేయనుంది. పరీక్ష నిర్వహణకు 50 వేల మందికిపైగా టీచర్లు, ఉద్యోగులను భాగస్వాములను చేయనుంది. అప్లికేషన్లు భారీగా రావడంతో జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్, మండల కేంద్రాల్లోనూ సెంటర్లను పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.

    ©️ VIL Media Pvt Ltd.

    Posted in Uncategorized

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *