ఒకే ఓవర్లలో 31 పరుగులు..డ్రెస్సింగ్ రూంలో రచ్చచేసిన యూసఫ్ పఠాన్ యూఏఈలో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ దారుణంగా విఫలమవుతున్నాడు. దుబాయ్ కాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న యూసఫ్ పఠాన్..డిజర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్ లో 31 సమర్పించుకున్నాడు. యూసఫ్ పఠాన్ బౌలింగ్ లో వెస్టిండీస్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ చెలరేగి ఆడాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదడంతో దుబాయ్ క్యాపిటల్స్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
డ్రెస్సింగ్ రూంలో రచ్చ రచ్చ
ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకోవడం అవమానంగా భావించిన యూసఫ్ పఠాన్.. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేశాడు. తన వల్లే మ్యాచ్ కోల్పోయినట్లు అందరూ చూడడంతో ..తనకు అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ స్థితిలో టీమ్ లో ఉండలేనంటూ సీరియస్గా బ్యాగ్ సర్దుకున్నాడు. తోటి ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ వద్దంటున్నా వినలేదు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
చాలా సీరియస్గా బయటకు వెళ్తున్నట్లు వెళ్లిన యూసఫ్ పఠాన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. దీంతో మిగతా క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దుబాయ్ క్యాపటిల్స్ ట్విటర్ లో షేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన డిజర్ట్ వైపర్స్ 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. ఆ తర్వాత దుబాయ్ క్యాపిటల్స్ 160 పరుగులే చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ 4 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
©️ VIL Media Pvt Ltd.