క్యాన్సర్ సోకిందని అబద్ధమాడి 439 మందిని ముంచింది
వాషింగ్టన్: నిండా 20 ఏండ్లు లేవు.. పెద్ద మోసానికే దిగిందో యువతి. తనకు క్యాన్సర్ వచ్చిందని, ట్రీట్‌మెంట్ కోసం డబ్బులు కావాలని వేలాది డాలర్లను సేకరించింది. వందల మంది నుంచి డొనేషన్ల పేరుతో వసూళ్లకు పాల్పడింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటాకటాలు లెక్కపెడుతోంది. అయోవాకు చెందిన 19 ఏండ్ల మాడిసన్ రస్సో.. తనకు లుకేమియా వచ్చిందని, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సోకిందని ప్రచారం చేసుకుంది.
టిక్ టాక్, గో ఫండ్ మీ వంటి వాటి ద్వారా డొనేషన్లను స్వీకరించింది. ఇలా మొత్తం 37 వేల డాలర్ల(రూ.30 లక్షలకు పైనే) ను సేకరించింది. ‘మాడిసన్ రస్సో గురించి జనవరి 11న సాయంత్రం 6 గంటలకు ఎల్‌డ్రిడ్జ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా, స్టేజ్ 2 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పి.. 439 మంది నుంచి 37,303 డాలర్లను విరాళంగా సేకరించారని ఫిర్యాదు అందింది’ అని అమెరికన్ మీడియా తెలిపింది.
©️ VIL Media Pvt Ltd.