Hyderabad: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వీవీ వినాయక్ తెరకెక్కించిన ‘ఠాగూర్’ సినిమాలో చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి ఆస్పత్రి సిబ్బంది డబ్బులు సొమ్ము చేసుకున్న సీన్ చూసే ఉంటాం. ఈ సీన్ బాగా పాపులర్ అయింది. సమాజంలో జరిగే ఘటనలకు దగ్గరకు ఉండటంతో.. ఆ సినిమాలో ఈ సీన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అలాంటి తరహా ఘటనలు సమాజంలో చాలా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒకచోట అలాంటి ఘటనలు బయటపడుతూనే ఉంటున్నాయి. డబ్బులు సొమ్ము చేసుకునేందుకు ఆస్పత్రి వైద్యులు చనిపోయిన పేషెంట్లకు డాక్టర్లు వైద్యం చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌లో ఠాగూర్ సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సుర్యాపేట శీవకృష్ణ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం హాస్పిటల్‌లో చేరారు. అయితే పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తమకు చెప్పలేదని, తాము అడిగినా ఏదో చెప్పి తప్పించుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యం కోసం రూ.50 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని, ఇన్సూరెన్స్ డబ్బులు క్లైమ్ చేసుకుని చనిపోయాడని చెప్పారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పేషెంట్ బంధువులకు చెప్పకుండా హాస్పిటల్ బయటకు తీసుకొస్తుంటే కుటుంబసభ్యులు చూసి గొడవపడ్డారు. దీంతో కాసేపు హాస్పిటల్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆస్పత్రి ముందు కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ చేపడుతున్నామని, నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.