Venkatram Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇంట్లో నాలుగో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 5 కార్లలో భారీగా చేరుకున్న ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అలాగే ఆయనకు సంబంధించి ముప్పా, వెర్టెక్స్ కంపెనీల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఇంటితో పాటు కంపెనీల్లో నాలుగు రోజులుగా తనిఖీలు జరుపుతుండటం సంచలనంగా మారింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఇంట్లో నాలుగు రోజులుగా సోదాలు జరుగుతుండటం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.
మూడురోజులుగా జరుపుతున్న సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేస్తున్నారు. ఆదాయ వివరాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపులపై వెంకట్రామిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి సంస్థల్లో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారెవరు? ఎంతమంది పెట్టుబడి పెట్టారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేయగా… పదవీకాలం ఉండగానే వీఆర్ఎస్ తీసుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఆయనకు కేసీఆర్ అవకాశం కల్పించారు. గతంలో ఆయన సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కారం చేయడం వివాదాస్పదంగా మారింది. ఐఏఎస్ అయి ఉండి కేసీఆర్ పాదాలకు నమస్కారం చేయడం ఏంటని ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు కురిపించారు. ఎమ్మెల్సీగా కొద్దినెలల క్రితమే బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. ఇప్పుడు వెంకట్రామిరెడ్డిపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.