తెలంగాణ దేశానికి రోల్ మోడల్ : గవర్నర్ తమిళిసై

తెలంగాణ దేశానికి రోల్ మోడల్ : గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా మారిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజల ఆశీర్వాదం, సీఎం సమర్థ పాలనతో రాష్ట్రం ఎనిమిదిన్నరేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. రెండేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన గవర్నర్.. ‘పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది’ అన్న కాళోజీ నారాయణ రావు మాటలతో  ప్రసంగాన్ని ప్రారంభించారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, ప్రజా సంక్షేమం, గ్రామీణ , పారిశ్రామికంగా ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని తన ప్రసంగంలో వివరించారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా 2014 -15లో రూ.1,24,000లుగా  ఉన్న తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.3,17,115 కు చేరిందని అన్నారు.

పండుగలా వ్యవసాయం 

వ్యవసాయ రంగంలో చరిత్ర సృష్టించిన తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారుతోందని గవర్నర్ అభిప్రాయప్డడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామని అన్నారు. ఉచిత, నాణ్యమైన విద్యుత్ ద్వారా రైతులకు ఎంతో లాభం చేకూరుతోందని, మిషన్ కాకతీయ పథకం వల్ల చెరువులకు పునర్వైభవం వచ్చిందని అన్నారు. మూడున్నరేళ్లలో పూర్తైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్న తమిళిసై.. నీటి లభ్యత పెరగడంతో పంటల సాగు గణనీయంగా పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించిందని, రైతులకు పెట్టుబడి సాయం, రూ.5లక్షల రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

సంక్షేమ పథకాలు

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే ముందుందని తమిళిసై అభిప్రాయపడ్డారు. దళితబంధు ద్వారా ప్రతి దళితుడికి రూ.10లక్షల చొప్పున ఇస్తూ వారి అభ్యున్నతికి దోహదపడుతున్నట్లు చెప్పారు. ఆసరా పింఛన్ పథకంలో లబ్దిదారుల వయసు 57ఏండ్లకు తగ్గించడం ద్వారా ఎక్కువ మందికి చేయూత అందిస్తున్నామని అన్నారు. ఎస్టీల రిజర్వేషన్లు 10శాతానికి పెంపు, గొర్రెల యూనిట్ల పంపిణీ, నేతన్నలకు బీమా, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాల తదితర పథకాలతో అన్ని  వర్గాలకు చేయూత అందిస్తున్నామని వివరించారు. 

విద్య, వైద్యం

పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 342 బస్తీ దవాఖానాలతో పాటు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు. హైదరాబాద్ నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణంతో పాటు నిమ్స్ లో మరో 2వేల పడకలు అదనంగా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.  మైనార్టీ గురుకులాలతో పాటు రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ సూళ్ల సంఖ్యను 310కి పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మన ఊరు మన బడి కింద రూ.7,289కోట్లతో మూడు దశల్లో స్కూళ్లు అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు.

ఉద్యోగాల భర్తీ 

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2022 వరకు 1,41,735 ఉద్యోగాలు భర్తీ చేశామన్న గవర్నర్.. ప్రభుత్వ శాఖల్లో మరో 80వేల ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేసిన విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఉద్యోగాల్లో స్థానికత కోసం కొత్త చట్టం తెచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని అన్నారు.

ఐటీ అభివృద్ధి

టీఎస్ ఐ పాస్ ద్వారా విప్లవాత్మక పురోగతి సాధించామన్న గవర్నర్, రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఎనిమిదిన్నరేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో 3.31లక్షళ కోట్ల పెట్టుబడలు ఆకర్షించిన విషయాన్ని ప్రస్తావించారు. ఐటీ ఉద్యోగ నియామకాల్లో 140శాతం వృద్ధి సాధించిన ఘనత తెలంగాణ సొంతమని గవర్నర్ అన్నారు. 

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *