పాకిస్తాన్ సబ్సిడీలను సగానికి తగ్గించుకోవాలె : ఐఎంఎఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) రివ్యూ మిషన్ షాక్ ఇచ్చింది. కరెంట్ చార్జీలు యూనిట్‌కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ల రూపాయలకు పరిమితం చేయాలని కండిషన్ పెట్టింది. అప్పుడే అదనపు నిధులు ఇస్తామని చెప్పింది. పాక్ సమర్పించిన రివైజ్డ్ సర్క్యులర్ డెట్ మేనేజ్మెంట్ ప్లాన్(సీడీఎంపీ)ను రిజెక్ట్ చేసింది. నాథన్ పోర్టర్ నేతృత్వంలోని ఐఎంఎఫ్ రివ్యూ మిషన్ ఇస్లామాబాద్‌లో పర్యటిస్తోంది. 7 బిలియన్ డాలర్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్)కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 9వ సమీక్షను పూర్తి చేయడానికి ఇరు వర్గాలు చర్చలు జరుపుతున్నాయి.
రియలిస్టిక్‌గా లేదు..
సవరించిన సీడీఎంపీ రియలిస్టిక్‌గా లేదని, ఇది తప్పుడు అంచనాలతో రూపొందిందని ఐఎంఎఫ్ పేర్కొంది. విద్యుత్ రంగ నష్టాలను నియంత్రించడానికి పాక్ ప్రభుత్వం తన పాలసీల్లో మార్పులు చేయాలని తెలిపింది. త్వరలో ప్రవేశపెట్టబోయే మినీ బడ్జెట్లో ఉన్న లోటును భర్తీ చేసేందుకు అదనపు పన్నులు వేయడంపై ఐఎంఎఫ్, పాక్ రక్షణ శాఖ కలిసి చర్చలు జరుతున్నాయి. రివైజ్డ్ సీడీఎంపీ ప్రకారం.. సర్క్యులర్ డెట్‌ను 952 బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు పెంచాలని పాక్ ఐఎంఎఫ్‌ను కోరింది. 2023 మొదటి రెండు క్వార్టర్లలో విద్యుత్ టారిఫ్ సర్దుబాటు ద్వారా యూనిట్ టారిఫ్‌ను 7 రూపాయలకు పెంచామని, జూన్ నుంచి మొదలయ్యే మూడో క్వార్టర్‌కు 1.64 రూపాయలు పెంచుతామని, అయినాసరే తమకు 675 బిలియన్ల రూపాయల అదనపు సబ్సిడీ అవసరమని సీడీఎంపీలో వివరించింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీ అవసరాలను 675 బిలియన్ల రూపాయలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా లెక్కించిందనే దానిపైనా ఐఎంఎఫ్ ప్రశ్నలు వేసింది.
©️ VIL Media Pvt Ltd.