భారత్‌తో తొలి టెస్టుకు ముందు ఆసీస్‌కు షాక్

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ నాగ్‌పూర్ టెస్టుకు దూరం కానున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో గ్రీన్ చేతి వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో 23 ఏళ్ల ఆల్‌రౌండర్ ఇప్పటికీ కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి గ్రీన్‌కు కొద్ది రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో గ్రీన్ తొలి టెస్టులో ఆడే అవకాశం లేదన్నట్టుగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంకేతాలిచ్చాడు.

గ్రీన్ ఒకవేళ నాగ్‌పూర్ టెస్టులో ఆడినా బౌలింగ్ చేయలేడని ఇంతకు ముందే ఆసీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా గ్రీన్ ఆడతాడో లేదో ఇప్పటికీ కచ్చితంగా తెలియదని కమిన్స్ గురువారం తెలిపాడు.

‘‘తొలి టెస్టులో అతడు బౌలింగ్ చేయలేడని నాకు తెలుసు. వచ్చే వారం ఎంతో ముఖ్యమైంది. అతడు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. వచ్చే వారం రోజుల్లో అతడు గాయం నుంచి కోలుకుంటాడని ఆశిస్తున్నాం’’ అని కమిన్స్ తెలిపాడు.

ఆల్‌రౌండర్ అయిన గ్రీన్ ఆడితే ఆసీస్ జట్టులో సమతూకం ఉంటుంది. ఒక వేళ ఆడినా గ్రీన్ బౌలింగ్ చేయలేకపోతే.. అతణ్ని ఓ బ్యాటర్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. గ్రీన్ పూర్తి ఫిట్‌గా ఉంటే అతడు మూడో పేసర్‌గా పనికొస్తాడు కాబట్టి.. ఆసీస్ జట్టు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగితే సరిపోతుంది. అతడు బౌలింగ్ చేయలేకపోతే.. జట్టులోకి అదనంగా మరో బౌలర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ వేదికగా ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *