ఇండియా ఆటో మొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ప్రస్థానం గొప్పది. దాదాపు ఆరు దశాబ్దాలుగా వినియోగదారులకు విలువైన సేవలు అందిస్తోంది. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం నాలుగు రోజుల్లో రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా బుకింగ్స్ సొంతం చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ జనవరి 26న ఉదయం 11 గంటలకు కంపెనీ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దాదాపు 34 సిటీల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
* ప్రారంభ ధరలు
XUV400 ఎలక్ట్రిక్ కారు EC, EL అనే రెండు వేరియంట్లో లభించనుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 15.99 లక్షలు(ఎక్స్ షోరూమ్), రూ. 18.99 లక్షలు(ఎక్స్ షోరూమ్). ప్రతి వేరియంట్‌లో 5,000 యూనిట్ల వరకే ఈ ప్రారంభ ధరలు వర్తించనున్నాయి. లాంచ్ చేసినప్పటి నుంచి ఒక సంవత్సరంలోపు దాదాపు 20,000 యూనిట్లను డెలివరీ చేయాలని కంపెనీ భావిస్తోంది. మహీంద్రా XUV400 లార్జ్-రేంజ్ EL వేరియంట్ డెలివరీలు మార్చి-2023లో స్టార్ట్ కానున్నాయి. ఇక లో-రేంజ్ EC వేరియంట్ డెలివరీలు దీపావళికి డెలివరీ చేయనున్నారు.
* ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఆల్-ఎలక్ట్రిక్ XUV400 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. సబ్-జీరో టెంపరేచర్ వద్ద ఒక రోజులో ఈ ఈవీ చాలా ఎక్కువ దూరం ప్రయాణించి రికార్డ్ క్రియేట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కైలాంగ్, లాహౌల్ స్పితి నుంచి ప్రారంభమై 24 గంటల్లో 751 కి.మీ దూరం ప్రయాణించింది. లోయర్ EC వేరియంట్‌లో 34.5 kWh బ్యాటరీ ఉంటుంది. EL వేరియంట్ 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. మహీంద్రా XUV400పై 3-సంవత్సరాలు/అన్‌లిమిడెట్ కిలోమీటర్స్ వారంట్ కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇక బ్యాటరీ, మోటార్‌పై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీ వరకు వారెంట్ ఉండనుంది.
* ఫిబ్రవరి 10 న మహీంద్రా EV ఫ్యాషన్ ఫెస్టివల్
ఆల్-ఎలక్ట్రిక్ XUV400 వన్-ఆఫ్-వన్, స్పెషల్ ఎడిషన్ వేలం జరిగింది. ఇది జనవరి 26న ఉదయం 11 గంటలకు ప్రారంభమై జనవరి 31, 2023 రాత్రి 11.59 గంటలకు వరకు కొనసాగింది. హైదరాబాద్‌లో జరిగే మహీంద్రా EV ఫ్యాషన్ ఫెస్టివల్ సందర్భంగా ఫిబ్రవరి 10న విజేత బిడ్డర్‌కు వన్-ఆఫ్ XUV400 ఎలక్ట్రిక్ SUVని అందజేయనున్నారు. విన్నింగ్ బిడ్ మొత్తాన్ని ‘మహీంద్రా రైజ్ సస్టైనబిలిటీ ఛాంపియన్ అవార్డ్స్’ విజేతలకు లేదా వారు ఎంపిక చేసుకున్న స్వచ్ఛంద సంస్థకు అందజేయనున్నారు.
* పూణేలో కొత్త EV ప్లాంట్
కంపెనీ తన EV పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి పూణేలో కొత్త EV ప్లాంట్‌ను నిర్మించనుంది. ఈ ఆటోమేకర్ తన కొత్త శ్రేణి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి రాబోయే 8 సంవత్సరాల్లో రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. కొత్త EV శ్రేణి మహీంద్రా INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది.