‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ మూవీ రివ్యూ.. డిఫరెంట్ అటెంప్ట్

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ప్రేక్ష‌కుడి అభిరుచి కూడా మారిపోతుంది. కొత్త, పాత‌.. చిన్న‌, పెద్ద అనే తేడా చూడ‌కుండా క‌థ బావుంటే సినిమాను ఆద‌రిస్తున్నారు. అలాంటి వైవిధ్య‌మై క‌థాంశంతో వ‌చ్చిన చిత్ర‌మే ‘తుపాకుల గూడెం’. ప్ర‌వీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్‌, జ‌య‌త్రి మ‌కానా, శివ‌రామ్ రెడ్డి స‌హా ప‌లువురు కొత్త న‌టీన‌టుల‌తో రూపొందిన ‘తుపాకుల గూడెం’ సినిమా ట్రైల‌ర్ చూస్తే ఇది న‌క్స‌ల్స్‌కు సంబంధించిన సినిమా అని తెలుస్తుంది. అస‌లు సినిమా టైటిల్‌, నక్స‌ల్స్‌కి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

ఆంధ్ర‌, తెలంగాణ‌, చ‌తీస్ గ‌ఢ్ రాష్ట్రాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రాంతంలో ఎన్నో గ్రామాలున్నాయి. అలాంటి వాటిలో ‘తుపాకుల గూడెం’ ఒక‌టి. అక్క‌డి ప్ర‌జ‌లు చిన్న చిత‌కా ప‌నులు చేస్తుంటారు. వేస‌విలో అయితే బీడీల‌కు ఉప‌యోగ‌ప‌డే తుముకు ఆకు అడవుల నుంచి తెచ్చి అమ్ముతుంటారు. అలా అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుల్లో కొంత మొత్తాన్ని న‌క్స‌ల్స్ వ‌చ్చి తీసుకుంటారు. మ‌రికొంత మొత్తాన్ని పోలీసులు తీసుకుంటారు. ఇవ‌న్నీ పోగా అక్క‌డి ప్ర‌జ‌ల క‌ష్టానికి త‌గ్గ డ‌బ్బులు మాత్రం దొర‌క‌వు. అలాంటి స‌మ‌యంలో తుపాకుల గూడెం గ్రామంలోని క్రాంతి అనే యువ‌కుడు ఎవ‌రికీ డ‌బ్బులు ఇవ్వ‌న‌క్క‌ర్లేద‌ని ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెబుతాడు. వారి ద‌గ్గ‌ర నుంచి తుముకు ఆకు తీసుకుని మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని బీడీ కంపెనీకి వెళ్లి అమ్మి డబ్బులు తీసుకుని వ‌స్తుండ‌గా న‌క్స‌ల్స్‌తో గొడ‌వ అవుతుంది. గొడ‌వ విష‌యం తెలియ‌గానే గ్రామ‌స్థులు ప‌రుగు ప‌రుగున అక్క‌డికి వ‌స్తారు. వ‌చ్చే లోపు ఓ న‌క్స‌ల్ చ‌నిపోయి ఉంటాడు. క్రాంతి క‌న‌ప‌డ‌డు. దాంతో గ్రామ‌స్థులు క్రాంతి త‌మ్ముడినికొట్ట‌బోతే అత‌ను పారిపోతాడు.

18 ఏళ్ల త‌ర్వాత క‌థ మ‌రో కోణంలో ప్రారంభం అవుతుంది. తుపాకుల గూడెంకు చెందిన రాజ‌న్న(ప్ర‌వీణ్ కండెల‌) ఆ గ్రామానికే కాకుండా చుట్టు ప‌క్క‌ల గ్రామాల‌కు దేవుడిలా ఉంటాడు. క‌ల‌ప‌ను స్మ‌గ్లింగ్ చేస్తుంటాడు. ఆ డ‌బ్బుల్లో పోలీసుల‌కు, న‌క్స‌ల్స్‌కు ఇస్తుండ‌టంతో అత‌నికి ఎవ‌రూ అడ్డు చెప్ప‌రు. అత‌ని ద‌గ్గ‌ర ప‌ని చేసే కుమార్(శ్రీకాంత్ రాథోడ్‌).. మమ‌త (జ‌య‌త్రి)ని ప్రేమిస్తాడు. గ‌వ‌ర్న‌మెంటు జాబ్ ఉంటూనే పిల్ల‌నిస్తాన‌ని మమ‌త త‌ల్లి చెప్ప‌టంతో కుమార్ ఆలోచ‌న‌లో ప‌డతాడు. అదే స‌మ‌యంలో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ న‌క్స‌ల్స్ లొంగిపోతే డ‌బ్బు, ఇల్లుతో పాటు పోలీసు ఉద్యోగాలిస్తామ‌నే స్కీమ్ పెడుతుంది. విష‌యం తెలిసిన కుమార్‌, త‌న స్నేహితుల‌తో పాటు 100 కుర్రాళ్ల‌ను న‌క్స‌ల్స్ పోలీసుల ముందు లొంగిపోతే డబ్బులు, ఉద్యోగం వ‌స్తుంద‌ని చెప్పి ఒప్పిస్తాడు. వాళ్లంతా న‌క్స‌ల్స్ డ్రెస్ వేసుకుని పోలీసులు వ‌స్తే లొంగిపోవ‌టానికి ఎదురు చూస్తుంటారు అదే స‌మ‌యంలో శివ‌న్న అనే న‌క్స‌లైట్ చేసిన ప‌ని వ‌ల్ల క‌థ పెద్ద మ‌లుపు తీసుకుంటుంది. ఇంత‌కీ శివ‌న్న చేసే ప‌నేంటి? కుమార్‌కి పోలీస్ ఉద్యోగం వ‌చ్చిందా? రాజ‌న్న ఎవ‌రు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

ద‌ర్శ‌కుడు జైదీప్ విష్ణు అండ్ టీమ్‌ 1990ల్లో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ‘తుపాకుల గూడెం’ పేరుతో క‌థ‌ను త‌యారు చేసుకున్నారు. సినిమా స్టార్టింగ్ పాయింట్ నుంచి కుమార్ అనే ప్ర‌ధాన పాత్ర కోణంలో క‌థ‌ను ఓపెన్ చేస్తూ సినిమాను న‌డిపించారు. అస‌లు తుపాకుల గూడెం.. అక్క‌డి చుట్టూ పక్క‌ల గ్రామాల్లోని ప్ర‌జ‌ల జీవ‌న విధానం.. మ‌రో వైపు న‌క్స‌ల్స్ కొన్ని స‌మ‌యాల్లో ఎలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతారు. దాని వ‌ల్ల క‌లిగే ప‌రిణామాలు.. అన్నింటినీ బేస్‌కుని క‌థ‌ను చ‌క్క‌గా ముందుకు తీసుకెళ్లారు. ప్ర‌జ‌ల‌కు క‌నీస అవ‌స‌రాలు లేన‌ప్పుడు వాళ్లు ఎదుర్కొనే ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నే దాన్ని కూడా ఈ సినిమాలో బాగానే చూపించారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల పేరు చెప్పి బ్రోక‌ర్లు ఎలాంటి మోసాలు చేస్తుంటారు. తిన‌టానికే తిండిలేని గ్రామ‌స్థులు బ్రోక‌ర్ మాట‌లు విని డ‌బ్బులు అత‌నికి ఇవ్వ‌టం.. మోస‌పోవ‌టం వంటి స‌న్నివేశాల‌ను చూపిస్తూనే రాజ‌న్న మ‌రో పాత్ర‌ను క్రియేట్ చేసిన అందులోనే ఓ రివేంజ్ స్టోరిని ర‌న్ చేశారు.

మెలోడీ బ్రహ్మ‌గా పేరు తెచ్చుకున్న మ‌ణిశ‌ర్మ సంగీతం, నేప‌థ్య సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. శ్రీకాంత్ అర్పుల విజువ‌ల్స్ చాలా నేచుర‌ల్‌గా అనిపిస్తాయి. సినిమా చూస్తున్నంత సేపు అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా అనిపించిన‌ప్ప‌టికీ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ .. సెకండాఫ్‌లో స్నేహితుల మ‌ధ్య వ‌చ్చే కామెడీ అన్నీ ఆక‌ట్ట‌కుంటాయి. మెయిన్ రోల్స్ చేసిన ప్ర‌వీణ్, శ్రీకాంత్ అంద‌ర‌రూ కొత్త‌వారైప్ప‌టీ న‌ట‌న ప‌రంగా ఎక్క‌డా తొట్రులేకుండా మెప్పించారు. ఇక హీరోయిన్ జ‌య‌త్రి ఇంత‌కు ముందు కొన్ని షార్ట్ ఫిలింస్‌లో న‌టించింది. ఈ సినిమా ఆమెకు న‌టిగా మంచి గుర్తింపునిస్తుంది. న‌క్స‌ల్ శివ‌న్న‌గా న‌టించిన శివరాం స‌హా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన శరత్, వంశీ, వినీత్, విజయ్, కిషోర్, జ్ఞానేశ్వర్, రాజశేఖర్, మ్యాగీ వంటి వారందరూ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు.

చివ‌ర‌గా.. ‘తుపాకుల గూడెం’… డిఫరెంట్ అటెంప్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *