సినిమాల్లో చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ ఇప్పుడు కీలక పాత్రలతో పాటు కథానాయకుడిగానూ నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన కలర్ ఫొటో తనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. అదే ఊపులో సుహాస్ చేసిన మరో ప్రయత్నమే ‘రైటర్ పద్మభూషణ్’. టీజర్, ట్రైలర్ చూస్తే ఓ యువకుడు రైటర్‌గా గుర్తింపు పొందటానికి చేసిన ప్రయత్నమని తెలుస్తుంది. సుహాస్ హీరోగా చేసిన కలర్ ఫొటో సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యింది. అయితే ‘రైటర్ పద్మభూషణ్’ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. మరీ సినిమా సుహాస్‌కు ఎలాంటి విజయాన్ని అందించిందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
విజయవాడలోని ప్రాంతీయ గ్రంథాలయంలో పద్మభూషణ్ (సుహాస్) అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా వర్క్ చేస్తుంటాడు. తల్లిదండ్రులు (ఆశిష్ విద్యార్థి, రోహిణి)కు చెప్పకుండా రైటర్‌గా పద్మభూషణ్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. అందు కోసం పద్మ భూషణ్ తొలి అడుగు అనే పుస్తకాన్ని రాయటమే కాకుండా నాలుగు లక్షలు అప్పు తెచ్చి మరీ అచ్చు వేయిస్తాడు. ఆ పుస్తకాలను అసలు ఎవడూ కొనడు. తనకు రైటర్‌గా గుర్తింపు రావటం లేదనే బాధ పెరిగిపోతుంటుంది. అలాంటి సమయంలో మామయ్య పెద్ద కూతురి పెళ్లికి వెళతాడు. అక్కడే తన చిన్న కూతురు సారిక (టీనా శిల్పా రాజ్)ను రైటర్ పద్మభూషణ్‌కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు మామయ్య చెప్పేస్తాడు.
దాంతో పద్మభూషణ్ రైటర్ అనే విషయం అందరికీ తెలిసిపోతుంది. అయితే అసలు ట్విస్ట్ అక్కడే వస్తుంది. రైటర్ పద్మభూషణ్ పేరుతో తన ఫొటోను ఉపయోగించి మరో రైటర్ రాసిన పుస్తకానికి చాలా మంచి పేరు వస్తుంది. నచ్చిన మరదలితో పెళ్లి అవుతుందనే కారణంతో పద్మభూషణ్ కూడా తను రాయని పుస్తకానికి తనే రైటర్‌నని చెప్పుకుంటాడు. కానీ లోపల ఎక్కడో భయం మాత్రం తనని వెంటాడుతూనే ఉంటుంది. మరో వైపు పద్మభూషణ్, సారిక నిశ్చితార్థం రోజునే పద్మభూషణ్ రాసే కొత్త పుస్తకాన్ని అచ్చు వేయాలని అతని మామయ్య ఎదురు చూస్తుంటాడు. ఇది ఇంకా పద్మభూషణ్‌లో టెన్షన్‌ని క్రియేట్ చేస్తుంటుంది. దాంతో అసలు రైటర్‌ని పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఇంతకీ పద్మ భూషణ్ అసలు రచయితని పట్టుకున్నాడా? లేదా? అసలు పద్మభూషణ్ పేరు మీద పుస్తకం రాసిన మరో రైటర్ ఎవరు? ఆ రైటర్‌కి పద్మభూషణ్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
మనింట్లో ఉండే అమ్మ అక్క, చెల్లెలు ఇంటి పనులు చేస్తూ ఎప్పుడూ బిజీగా కనపడుతుంటారు. వారిని చదువుకోనిస్తాం కానీ.. ఓ స్టేజ్ తర్వాత వారేం కావాలనుకుంటున్నారని మనం పట్టించుకోం. ఇంట్లో మనకు పనులు జరుగుతున్నాయా? లేవా? అనేదే చూస్తాం. కానీ వారికి ఆశలు, ఆశయాలుంటాయనే విషయాన్ని మరచిపోతాం. ఇదే పాయింట్ మీద తెరకెక్కిన చిత్రమే ‘రైటర్ పద్మభూషణ్’. సినిమాను సుహాస్ కోణంలో తీసుకెళ్లి.. దాన్ని మరో కోణంలో ఎలివేట్ చేశాడు దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్. సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే సుహాస్ రైటర్ కావాలనుకోవటం.. అప్పు తెచ్చి పుస్తకం అచ్చు వేయిస్తే అది అమ్ముడు కాకపోవటం.. రైటర్‌గా తనని నిరూపించుకోవటానికి తన పుస్తకాన్ని అందరూ చదవాలని తాపత్రయపడటం వంటి సన్నివేశాలతోనే సినిమాను రన్ చేశారు. మధ్యలో హీరోయిన్‌తో ప్రేమ సన్నివేశాలను ఎలివేట్ చేస్తూ వచ్చారు.
సెకండాఫ్‌లో అసలు పుస్తకం రాసిన రైటర్‌ని పట్టుకుని మరో పుస్తకం రాయించాలనే ప్రయత్నం. దాని చుట్టూ సన్నివేశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌లో హీరో తనలోని రైటర్‌ని బయటకు తీయాలనుకోవటం, క్లైమాక్స్‌లో రైటర్ ఎవరో తెలిసిన కథానాయకుడు తీసుకునే నిర్ణయం.. దాని చుట్టూ ఉండే ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సినిమా ఎండ్ అవుతుంది. చివరలో మహిళలకు మద్దతుగా ఓ ఎమోషనల్ పాయింట్‌ను టచ్ చేశారు. లోకం ఎంతో ముందుకు వెళ్లిపోతుంది. మన చుట్టూ ఉన్న మహిళలు ఏదేదో సాధించేస్తున్నారు. అయితే మనం మాత్రం మన ఇంట్లో ఉన్నవారి గురించి ఆలోచించం. వారికి ఏం కావాలి.. వారు జీవితంలో ఏం సాధించాలనుకున్నారు? అనే విషయాన్ని పట్టించుకోం. కానీ మగవాళ్లు చేయాల్సిన పనుల్లో అది కూడా ఒకటని చెప్పే ప్రయత్నమే ఈ ‘రైటర్ పద్మభూషణ్’.
నటీనటుల విషయానికి వస్తే సుహాస్ తన బాడీ లాంగ్వేజ్‌తో ఓ వైపు కామెడీ చేస్తూనే ఎమోషన్స్‌ను క్యారీ చేశారు. మన ఇంటి పక్క నుంచే కుర్రాడి కథలాగానే సినిమా స్టార్ట్ అవుతుంది. దానికి సుహాస్ న్యాయం చేశాడు. హీరో తండ్రి … మధ్యతరగతి వ్యక్తి. అతని ఆలోచనలు, ప్రవర్తన ఎలా ఉంటుంది అనే పాత్రలో ఆశిష్ విద్యార్థి నటన ఆకట్టుకుంటుంది. ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి ఓ డిఫరెంట్ పాత్రలో ఆయన కనిపించటం.. ఆయన నటన ఆకట్టుకుంటాయి. హీరో తల్లిగా చేసిన రోహిణి.. ఎమోషనల్ రోల్‌ను అద్భుతంగా పోషించింది. సినిమా క్లైమాక్స్ అంతా తను చుట్టూనే తిరుగుతుంది. ఆమె దాన్ని చక్కగా క్యారీ చేసింది. ఇక హీరోయిన్ టీనా శిల్పా రాజ్, సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన గౌరి ప్రియ, హీరో స్నేహితుడిగా చేసిన కుర్రాడు.. హీరో మామయ్యగా చేసిన గోపరాజు రమణ ఇలా అందరూ వారి వారి పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తను చెప్పాలనుకున్న సీరియస్ పాయింట్‌ను చివరలో చక్కగా ఎలివేట్ చేసిన తీరు బావుంది. హీరో క్యారెక్టర్‌ను కామెడీ కోణంలో చూపించే ప్రయత్నంలో తెరకెక్కించిన సన్నివేశాలు.. ఉదాహరణకు థియేటర్‌లో హీరో గోల చేసే ప్రయత్నం, సందర్భానుసారం హీరో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ బావున్నాయి. అయితే సెకండాఫ్‌లో క్లైమాక్స్ వచ్చే వరకు సాగే సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే ఫస్టాఫ్‌లోనూ సన్నివేశాలు స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తాయి. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ సంగీతం బావుంది. వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ బావుంది.
చివరగా.. ‘రైటర్ పద్మభూషణ్’.. మంచి మెసేజ్‌తో సాగే ఎమోషనల్ డ్రామా