లోకల్ రైల్లో యువతి, యువకుడి అనుచిత ప్రవర్తన.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలి?

బస్సులు, రైళ్లూ.. ఏవో తమ బాబు గారి సొమ్ములా ప్రవర్తించే కొంత మంది ప్రయాణికులను చూస్తే, చాలా మందికి ఒళ్లు మండుతుంది. ప్రయాణంలో అలాంటి వారు తోటి ప్రయాణికులకు విపరీతమైన అసౌకర్యం కల్గిస్తుంటారు. రుబాబుగా ముందు సీట్లపై చాచుకొని కాళ్లు పెట్టడం, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకుండా సగం సీటు తామే ఆక్రమించుకోవడం, తోటి వారు ఓ వైపు నిల్చొని ఉంటే.. బ్యాగులు, సామగ్రి సీట్లో పెట్టుకొని దర్జా ప్రదర్శించడం తరచూ చూసే దృశ్యాలే. అలాంటి వారిని కదిలిస్తే.. నోరు పెద్దది చేసుకొని మీదపడిపోతారు. ఏదో పెద్దగా చదువుకోని వారు, తెలిసీ తెలియని వారు చేశారనుకుంటే అది వేరు. కానీ, ముంబైలో ఓ యువతి ఇలాగే రెచ్చిపోయింది. లోకల్ ట్రైన్‌లో కాళ్లు బార్లా చాచుకొని ఎదురుగా ఉన్న సీటుపై పెట్టింది. ఆ సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ఆమెను కాళ్లు తీయాలని గౌరవంగా కోరితే.. అమర్యాదకరంగా ప్రవర్తించింది. ‘నా ఇష్టం ఇలాగే కూర్చుంటా..’ అంటూ అతడితో వాగ్వాదానికి దిగింది.

ముంబైకి చెందిన ఫోటో జర్నలిస్ట్ ప్రశాంత్‌కు లోకల్ ట్రైన్‌లో ఈ పరాభవం ఎదురైంది. తనను తాను లాయర్ అని చెప్పుకున్న ఆ యువతి వెంట ఓ యువకుడు కూడా ఉన్నాడు. వారిద్దరూ ప్రశాంత్‌పై విరుచుకుపడ్డారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వాళ్ల దురుసు ప్రవర్తనను జర్నలిస్ట్ ప్రశాంత్ తన ఫోన్లో చిత్రీకరించాడు. దీంతో ఆ యువతి అతడి వద్ద నుంచి దౌర్జన్యంగా ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రశాంత్.. తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ‘లాయర్లుగా చెప్పుకుంటున్న వీళ్లు రైలులో ఇలా కూర్చున్నారు..’ అంటూ కామెంట్ పెట్టారు. ముంబయి పోలీస్, రైల్వే అధికారులను ట్యాగ్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. వారి ప్రవర్తనపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

‘ఎదురు సీటు ఖాళీగా లేనప్పుడు కూడా పాదాలను సీటుపై ఉంచడం మర్యాద కాదు’ అని ఒక యూజర్ రాశారు. ఒకవేళ ఆమెకు శిక్ష విధించాల్సి వస్తే.. ఆంటూ మరొక యూజర్ ఇలా రాసుకొచ్చారు.. ‘వాళ్లను ఒక నెల పాటు ప్రయాణానికి అనుమతించకుండా నిషేధం విధించాలి. నేను ఈ రైలు సీటుపై నా కాళ్లు పెట్టాను, తోటి ప్రయాణికులను అగౌరవపరిచిన న్యాయవాదిని. నన్ను క్షమించండి అంటూ వారి మెడలో ట్యాగ్ పెట్టి, రెండు రోజుల పాటు రైల్లో సీట్లను శుభ్రం చేయించాలి’ అని పేర్కొన్నాడు. ‘దీన్ని ఇకనైనా ఆపాలి బ్రో.. ధైర్యంగా పోస్టు చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

భారతదేశం అంతటా రైళ్లు, బస్సులలో ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. తోటి వారి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించే ఇలాంటి ప్రయాణీకులపై అప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు కండక్టర్లు, టీటీఆర్‌లకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. మరి మీరేమంటారూ..?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *