Gannavaram Ysrcp: గన్నవరం వైఎస్సార్‌సీపీలో రాజకీయం గరం గరంగా మారింది. పార్టీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు దుట్టా రామచంద్రరావు (Dutta Ramachandra Rao), యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkat Rao)ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi), మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)పై ఇద్దరు నేతలు చేసిన కామెంట్స్ కలకలంరేపాయి.
ఈ వీడియోలో చేసిన వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. కొందరు పనీ పాట లేని వాళ్లు ఏదో ఒకటి మాట్లాడతారని.. ఈ వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకుని వెళ్ళాల్సి అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఏం మాట్లాడారో తాను ఇంకా చూడలేదని.. తాను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో బిజీగా ఉన్నానన్నారు. వీళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో తనకు, కొడాలి నానికి తెలుసన్నారు.
మరోసారి ఎక్కువగా మాట్లాడితే డొక్క పగలగొట్టి డోలు కడతామని వార్నింగ్ ఇచ్చారు. వార్డుకు, పంచాయతీకి గెలవని వాళ్లు తనకు సహకరించేది ఏంటని దుట్టాపై సెటైర్లు పేల్చారు. వంశీని, కొడాలి నానిని తిడితే పెద్ద వాళ్లం అవుతున్నామని.. వాళ్లే అంటున్నారన్నారు. టీడీపీలో తాను, నాని ఎలా ఉన్నామో వైఎస్సార్‌సీపీలో కూడా తమ స్టైల్ అలాగే ఉంటుందన్నారు. కళ్ళు చిదంబరం అద్దం ముందు నిలబడి మహేష్ బాబు అనుకుంటే అయిపోతారా అన్నారు.
అరగుండు బ్రహ్మానందం, అంకుశం రామిరెడ్డి మహేష్ బాబు అనుకుంటే మహేష్ బాబులు అయిపోరన్నారు. అద్దం ముందు నిలబడి చూసుకుంటే ఎవరేంటో తెలుస్తుందన్నారు. క్లైమాక్స్ ముందే చెబితే సినిమా ఎవరూ చూడరని.. తాను గన్నవరానికి ఏం చేశానో ఇక్కడి ప్రజలకు తెలుసన్నారు. వలస పక్షులకు ఏం తెలుస్తుందన్నారు వంశీ.
గన్నవరం వైఎస్సార్‌సీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్న సందర్బంలో చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి. కొడాలి నాని ఏడో తగతి తప్పారని ఎద్దేవా చేశారు. ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్‌కే ఎక్కువ క్రేజ్ ఉంటుందని కామెంట్ చేశారు ఇద్దరు నేతలు. నియోజకవర్గానికి ఎందుకైనా ఉపయోగపడతారా.. వల్లభనేని వంశీ కొడాలి నానికి ఆస్తులు ఎలా వచ్చాయి అన్నారు. ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారని ఇద్దరు మాట్లాడుకున్నారు. వల్లభనేని వంశీ ఆగడాలను తాము పశ్నించబట్టే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది అని దుట్టా వ్యాఖ్యానించారు. మీడియాను మేనేజ్ చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.
ఈ వీడియోపై దుట్టా రామచంద్రరావు స్పందించారు. తమ పార్టీ నాయకులను ఏమి అనలేదని.. అసలు జగన్ పరిపాలన బాగోలేదని అన్న మాటలు వాస్తవం కాదన్నారు. వైకుంఠపురంలో గుడి ప్రారంభోత్సవానికి వెళ్లానని.. అక్కడికి యార్లగడ్డ వెంకట్రావు కూడా వచ్చారన్నారు. తమతో పాటూ ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు కొడాలి నాని 7వ తరగతి ఫెయిలయ్యారని వ్యాఖ్లయు చేశారని.. తాను కానీ యార్లగడ్డ కానీ మాట్లాడలేదన్నారు. జగన్ పాలన బాగా లేదని తాను కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతోందన్నారు.
తాను ,యార్లగడ్డ వెంకట్రావు వైఎస్సార్‌సీపీ కోసం పనిచేస్తామని.. అధిష్టానం పిలిచి వంశీతో కలిసి పని చేయమన్నారని.. తాను చేయనని ఇప్పటికే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మీడియాలో మాట్లాడొద్దన్న మాటకి కట్టుబడి ఉన్నాను అన్నారు. కానీ తనపై ఎవరైనా మాట్లాడితే తాను తిరిగి మాట్లాడతానన్నారు. వైఎస్ జగన్‌తో జీవితాంతం కలిసి పని చేస్తాననని.. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన వెంటే కొనసాగుతానన్నారు.