సింధు జలాల ఒప్పందం.. ప్రపంచ బ్యాంకు వైఖరిపై భారత్ తీవ్ర అభ్యంతరం

సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో ప్రపంచ బ్యాంకు వైఖరిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న సింధు నదీ జలాల వివాదం విషయంలో తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రపంచ బ్యాంకు ప్రారంభించింది. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. గతవారం ఇదే అంశంపై పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ‘‘వారు (ప్రపంచ బ్యాంకు) మా ఒప్పందాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారని నేను అనుకోను.. ఇది మన రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం.. ఒప్పందంపై మా అంచనా ప్రకారం గ్రేడెడ్ విధానం నిబంధన ఉంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ప్రకటనలో అన్నారు.

‘‘1960లో చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామని భారత్ సింధు నది వాటర్ కమిషన్ జనవరి 25న పాకిస్థాన్‌కు నోటీసు జారీచేసింది’’ అని బాగ్చీ పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్యవర్తిత్వ కోర్టును ప్రారంభించడాన్ని భారత్ నిరుత్సాహానికి గురయ్యిందని వ్యాఖ్యానించారు. కొనసాగుతున్న ఒప్పందంలో భౌతిక ఉల్లంఘనను సరిదిద్దడానికి ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు జరపడానికి పాకిస్థాన్‌కు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నోటీసు జారీ చేశామని విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

ఒప్పందంలోని ఆర్టికల్ 12 (III) ప్రకారం అంతర్-రాష్ట్ర ద్వైపాక్షిక చర్చల ప్రారంభానికి తగిన తేదీని 90 రోజుల్లోగా తెలియజేయాలని పాకిస్థాన్‌ను భారత్ కోరిందని బాగ్చీ చెప్పారు. ‘దీనిపై పాకిస్తాన్ ప్రతిస్పందన గురించి నాకు ఇంకా తెలియదు.. ప్రపంచ బ్యాంక్ ఎటువంటి ప్రతిస్పందన లేదా వ్యాఖ్య గురించి నాకు తెలియదు’ అని చెప్పారు.

‘‘ప్రపంచ బ్యాంక్ పాత్ర విధానపరమైనది.. సరిహద్దు నదులకు సంబంధించిన సమస్యలపై భారత్, పాకిస్థాన్ మధ్య విభేదాల విషయంలో తటస్థ నిపుణులను లేదా మధ్యవర్తిత్వ న్యాయస్థానం అధ్యక్షుడిని నియమించింది.. వారు (ప్రపంచ బ్యాంకు) మన ఒప్పందాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారని నేను అనుకోను.. ఇది మా రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం.. ఒప్పందంపై మా అంచనా ప్రకారం గ్రేడెడ్ విధానం నిబంధన ఉంది’’ అని వివరించారు.

ప్రపంచ బ్యాంకు దాదాపు ఐదు-ఆరు సంవత్సరాల కిందట రెండు సమాంతర ప్రక్రియలను కలిగి ఉన్న సమస్యను గుర్తించింది.. మా వివరణ, అంచనా ఏమిటంటే ఇది ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణంగా లేదు.. అందుకే మేము గ్రేడెడ్ విధానం గురించి మాట్లాడుతున్నాం’’ అని అన్నారు. సింధు నదిపై భారత్ చేపట్టిన కిషన్‌ గంగా, రాట్లే ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వాటి పరిశీలనకు తటస్థ నిపుణులు అవసరమని 2015లో పాకిస్థాన్ అభ్యర్థించింది.

Read Latest National News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *