కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచం మొత్తం కుదేలయ్యింది. మిలియన్ల మంది ప్రజలను ప్రాణాలు హరించిన కోవిడ్-19.. ప్రజలు జీవితాలను అల్లకల్లోలం చేసింది. కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయి.. ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. కోవిడ్ నష్టాల నుంచి పలు దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునేలా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాతో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు హాంకాంగ్ భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయనున్నట్టు ప్రకటించింది.
‘హలో హాంకాంగ్’ పేరుతో గురువారం ఓ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఉచిత విమాన టికెట్లు, ఉచిత ఓచర్లు, ప్రత్యేక ఆఫర్లు సైతం అందిస్తోంది. అదేవిధంగా లక్కీ డ్రాలు, ఒకటి కొంటే మరొకటి ఉచితం వంటి ఆఫర్లతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ఆపర్లు మార్చి నెల వరకు అందుబాటులో ఉంటాయని హాంకాంగ్ అధికారులు పేర్కొన్నారు. హాంకాంగ్‌కు చెందిన క్యాథే పసిఫిక్, హెచ్‌కే ఎక్స్‌ప్రెస్, హాంకాంగ్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో 354.8 మిలియన్ డాలర్లు విలువైన 5 లక్షల టిక్కెట్‌లను ఉచితంగా అందజేస్తారు.
హాంకాంగ్‌కు వెళ్లాలని ఆసక్తి ఉన్న ప్రయాణికులు మార్చి 1 నుంచి వరల్డ్ ఆఫ్ విన్నర్స్ స్ప్లాష్ పేజీని సందర్శించి విమాన టిక్కెట్ లాటరీలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ టిక్కెట్‌లను మూడు విడతలుగా చేశారు. మార్చి 1 నుంచి ఆగ్నేయాసియా పర్యాటకులు, ఏప్రిల్ 1 నుంచి చైనాలో ఉన్నవారికి, మే 1 నుంచి ప్రపంచంలో మిగతా దేశాల ప్రజలకు కేటాయిస్తారు.
స్థానికులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. జూలై 1 నుంచి ఆసక్తి ఉన్న హాంకాంగ్ ప్రజలకు కొన్ని విమానయాన టిక్కెట్‌లు అందించనున్నారు. కరోనా కారణంగా హాంకాంగ్‌లోని జంబో కింగ్‌డమ్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ వంటి కొన్ని ముఖ్యమైనవి శాశ్వతంగా మూసివేశారు. ప్రసిద్ధ పీక్ ట్రామ్ వంటి ఇతర పర్యాటక ప్రాంతాలు మూతబడ్డాయి. జనవరి 2020లో తొలి కరోనా కేసు నమోదయిన వెంటనే హాంకాంగ్ ప్రభుత్వం పర్యాటకులు, వినోదాలపై నిషేధం విధించింది. విదేశీ ప్రయాణికులకు 21 రోజుల క్యారంటైన్ నిబంధనలు కఠినంగా అమలు చేసింది.
Read Latest International News And Telugu News