Rebels of Thupakula Gudem Review: ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ రివ్యూ.. కొత్త ప్రయత్నం..

నటీనటులు: ప్రవీణ్ కందెల, శివరామ్ రెడ్డి, శ్రీకాంత్ రాథోడ్, జైత్రి మకానా, వంశీ వూటుకూరు, శరత్ బరిగెల, వినీత్ కుమార్, విజయ్ మచ్చ తదితరులు

సంగీత దర్శకులు: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ ఏర్పుల

ఎడిటర్: జైదీప్ విష్ణు

దర్శకుడు : జైదీప్ విష్ణు

నిర్మాతలు: వారధి క్రియేషన్స్

ఈ రోజుల్లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల్లోనే మంచి కంటెంట్ వస్తుంది. ముఖ్యంగా కొత్త దర్శకుల నుంచి డిజిటల్‌తో పాటు థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఆసక్తికరమైన కథలను తీసుకొస్తున్నారు. తాజాగా రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే సినిమా కూడా అలా వచ్చిందే. ఈ సినిమా టీజర్‌తోనే అందర్నీ ఆకట్టుకుంది.. అంతా కొత్త వాళ్లతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..

కథ:

దేశంలో ఉన్న నక్సలైట్స్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. దళంలో ఉన్న వాళ్లంతా జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని.. వెంటనే లొంగిపోవాలని సరెండర్ పెరేడ్ పేరిట ఒక పథకం కూడా తీసుకువస్తుంది. అందులో భాగంగానే 100 మంది అమాయకులని లొంగిపోవాలని సూచిస్తుంది కేంద్ర ప్రభుత్వం. నక్సలైట్లు సరెండర్ అయితే మూడు లక్షల రూపాయల డబ్బు, పోలీసు ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తారు. అలా నక్సలైట్ల పేరుతో ఏజెన్సీ ప్రాంతాల వ్యక్తులను లొంగిపోయేలా చేయడానికి ఒక బ్రోకర్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయాన్ని ఏజెన్సీలో పేరు మోసిన వ్యక్తి రాజన్న దృష్టికి తీసుకువెళ్తే.. ఆ పనిని తన దగ్గర ఉండే కుమార్ అనే వ్యక్తికి అప్పగిస్తాడు రాజన్న. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇవ్వలేమని.. మనిషికి లక్ష రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెడతాడు బ్రోకర్. అలా వందమంది కలిసి కోటి రూపాయలు డబ్బు పోగుచేసుకుని బ్రోకర్‌కి ఇచ్చాక అతను మిస్ అవుతాడు. ఈ 100 మంది గవర్నమెంట్‌కి లొంగిపోయి పోలీసులయ్యారా.. నిజంగా వాళ్లకు బ్రోకర్ న్యాయం చేసాడా లేదా అనేదిఅసలు కథ..

కథనం:

రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా కథ కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ కథలకు దూరంగా ఉండేలా ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు విష్ణు. అందులోనే వినోదంతో పాటు సందేశం కూడా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. సినిమా కథ అంతా ఆద్యంతం అడవుల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో చాలా సమస్యలను సున్నితంగా ప్రశ్నించాడు దర్శకుడు విష్ణు. ముఖ్యంగా ఏజెన్సీల వ్యవహారం అంటే ఎక్కువగా రోడ్డు లేకపోవడం.. ఇతర ప్రాంతాల వాళ్ళతో కనీసం మాట్లాడే సౌకర్యం కూడా లేకపోవడం ఉంటాయనే సమస్యలను చూపించాడు. 100 మంది అమాయక గిరిజనులను బ్రోకర్ ఎలా మోసం చేశాడనే దాని చుట్టూనే ఎక్కువగా కథ సాగుతుంది. ఊరిని బాగు చేయడం కోసం వెళ్లిన క్రాంతి అనూహ్యంగా మరణించడం.. అతని తమ్ముడు రాజన్న తన అన్న చావుకి కారణం తెలుసుకుని.. అన్నయ్యను నిర్దోషిగా ఎలా బయటికి తీసుకొస్తాడు.. ఊరి జనం ముందు ఎలా ప్రూవ్ చేస్తాడనేది ఆసక్తికరంగానే సాగుతుంది. అలాగే బ్రోకర్ మాటలు నమ్మి నక్సలైట్ల దుస్తులు ధరించి అడవిలోకి వెళ్లిన ఊరి ప్రజలు చివరికి ఏమవుతారనేది కూడా మంచి ట్విస్టులతో రాసుకున్నాడు దర్శకుడు విష్ణు. సినిమా సూపర్ అనలేం కానీ కచ్చితంగా మంచి ప్రయత్నం అయితే చేసారని చెప్పొచ్చు.

నటీనటులు:

ఇందులో ఉన్న వాళ్లంతా కొత్త వాళ్లే. యూ ట్యూబ్‌తో పరిచయం ఉన్న వాళ్లకు అయితే జయత్రి మాత్రం పరిచయం ఉంటుంది. ఈ సినిమా మొత్తానికి ఆమె కాస్త తెలిసిన మొహం. క్రాంతి పాత్రలో నటించిన సురంజిత్, రాజన్నగా నటించిన ప్రవీణ్, కుమార్‌గా నటించిన శ్రీకాంత్ రాథోడ్, శివన్నగా నటించిన శివరాం బాగున్నారు. మిగిలిన పాత్రల్లో శరత్, వంశీ, వినీత్, విజయ్, కిషోర్ లాంటి వాళ్లంతా బాగానే చేసారు. కొత్త వాళ్లే అయినా స్క్రీన్ మీద ఎక్కడా బోర్ రాకుండా నటించారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమా అంతా అడవుల నేపథ్యంలోనే సాగుతుంది. ఇలాంటి కథలకు సినిమాటోగ్రఫీ కీలకం. తుపాకుల గూడెం విషయంలో ఈ సెక్షన్ స్ట్రాంగ్. ఈ సినిమాకి ప్రధాన అసెట్ అదే. సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ అడవులను అందంగా చూపించాడు. ఇక మణిశర్మ అందించిన సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఎడిటింగ్ కాస్త వీక్. డైరెక్టర్ జైదీప్ విష్ణుకి ఇది మొదటి సినిమానే అయినా కూడా మంచి కథ తీసుకున్నాడు.

చివరగా ఒక్కమాట:

రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం.. ఓ మంచి ప్రయత్నం

రేటింగ్: 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *