Telangana: తెలంగాణలో కొత్తగా మూడు ఎయిర్‌పోర్టులు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్

Telangana: తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. బేగంపేట ఎయిర్‌పోర్టును వీవీఐపీలు, వీఐపీల రాకపోకలకు మాత్రమే ఉపయోగిస్తుండగా.. హకీంపేట ఎయిర్‌పోర్టు వైమానిక దళ అవసరాలు, శిక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే రాష్ట్రంలో మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాల్లో 6 మినీ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం గతంలో ప్రతిపాదనలు పంపించింది.

రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తాజాగా లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో మాత్రమే ఎయిర్‌పోర్టుల నిర్మాణం సాంకేతికగా సాధ్యమవుతుందని పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వీకేసింగ్ చెప్పారు. ఎయిర్‌పోర్టులకు అనుమతిపై పార్లమెంట్‌లో మహబూబాబాద్, పెద్దపల్లి, చేవెళ్ల ఎంపీలు అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానం ఇచ్చారు. ఆ మూడు ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాలోని మామునూరు, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలోని జక్రాన్‌పల్లి, పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్, మహబూబ్ నగర్ జిల్లాలోని గుడిబండ, కొత్తగూడెం ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం భావించింది.

అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీంతో అప్పట్లో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) అధికారులు ఆరు ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలు ఎయిర్‌పోర్టుకు అనుకూలమేనా..?. రాకపోకలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అనే అంశాలను పరిశీలించారు. అయితే పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాల్లో కొండలు ఎక్కువగా ఉండటంతో.. విమానాల రాకపోకలకు అనువైన స్థలం కాదని అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం కేవలం మూడు ప్రాంతాల్లో మాత్రమే ఎయిర్‌పోర్టుల నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తాజాగా తెలిపింది.

నిజామాబాద్‌ జిల్లా జాక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లా మామునూరులో బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ మూడు ప్రాంతాల్లో కొండలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని, ఒకవైపు మాత్రమే విమానాల రాకపోకలు సాగించాల్సి ఉంటుందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గతంలో ఒక నివేదిక ఇచ్చారు. దీంతో ఆ మూడు ప్రాంతాలు కాకుండా మిగతా మూడు ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి సాధ్యమవుతుందని, ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *