Terror Alert: ముంబైలో మరోసారి మారణహోమం తప్పదా? ఆర్థిక రాజధానిలో హై అలెర్ట్‌

ఎన్‌ఐఏ తాజాగా చెప్పిన ఓ విషయం ముంబైని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ముంబైలో మరోసారి ఉగ్రదాడి చేస్తామంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి ఈ-మెయిల్ రావడం కలకలం రేపుతోంది. తాను తాలిబాస్‌ సభ్యుడనంటూ దర్యాప్తు సంస్థకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్‌ పంపాడు. ముంబైలో ఉగ్రదాడి జరుగుతుందంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ పంపిన విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. దీంతో ముంబై ప్రజలను మరోసారి 26/11 చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భయపడుతున్నారు. నిజంగా ముంబైకి మరోసారి ఉగ్ర ముప్పు పొంచి ఉందా..? ఎన్‌ఐఏ చెబుతున్న మెయిల్‌లో ఏముంది..? ఈ మెయిల్‌ నిజంగానే తాలిబన్‌ లింకులున్న వ్యక్తి పంపాడా..? లేక ఫేక్‌గా భయ పెట్టడానికి వేరే ఎవరైనా పంపారా..?

ముంబై వ్యాప్తంగా హై అలెర్ట్‌:

మెయిల్‌లో వచ్చిన వార్నింగ్‌తో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులకు సమాచారం అందించారు. ముఖ్యమైన, సమస్యాత్మకమైన ప్రాంతాలలో భద్రత పెంచాలని సూచించారు. ఈ సూచనలతో ముంబై పోలీసులతో పాటు ఎన్ఐఏ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది. నగరంలోని పలుచోట్ల భద్రత పెంచడంతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నగరంలో ఇన్ఫినిటీ మాల్ అంధేరి, పీవీఆర్ మాల్ జుహు, సహారా హోటల్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు..

మెయిల్ పంపిది ఎవరు..?

తాలిబన్  సభ్యుడనని పేర్కొంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ హెచ్చరిక మెయిల్ వచ్చినట్టు ఎన్‌ఐఏ తెలిపింది. ఈ-మెయిల్ అడ్రెస్‌లో “సీఐఏ” అని ఉందని సమాచారం. మెయిల్‌ పంపిన వ్యక్తి ఐపీ అడ్రెస్‌ ట్రేస్‌ చేశారు పోలీసులు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రెస్‌ పాకిస్తాన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇందులోని నిజనిజాలను నిగ్గు తెల్చేందుకు ఎన్‌ఐఏ, ముంబై పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇలాంటి బెదిరింపు మెయిల్స్‌, కాల్స్‌ రావడం ఇదేం మొదటి సారి కాదు. గత అక్టోబర్‌లో ముంబైలోని పలు కీలక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్టు పోలీసులకు బెదరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఇక నిన్నటికి నిన్న అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో పేలుళ్లకు పాల్పడతామంటూ రామ్ కోట్‌లోని  రాంలల్లా సదన్ ఆలయంలో నివసించే మనోజ్ అనే వ్యక్తికి బెదిరింపు కాల్ వచ్చింది. ఇక గత జనవరిలో ముంబైలోని ధీరుభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో బాంబు పెట్టామంటూ ఇలానే ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. ఇలా వరుస పెట్టి బెదిరింపు కాల్స్‌ వస్తుండడం అటు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారగా.. ప్రజల్లో మాత్రం రోజురోజుకు భయాందోళలను పెరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *