అడ్రస్ చెప్తే ఏం చేస్తారు.. కన్న తండ్రి గురించి పవన్ అలా మాట్లాడొచ్చా? ఫ్యాన్స్‌‌కి తమ్మారెడ్డి కౌంటర్

తమ్మారెడ్డి భరద్వాజ వర్సెస్ జనసైనికుల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్‌పై తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై గరం అవుతున్నారు జనసైనికులు. తమ్మారెడ్డికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

తాజా వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కొంతమంది ఫోన్‌లు చేస్తున్నారు.. వాట్సాప్‌లో మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. అసలు నువ్ ఎవడివి? మా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేటంత గొప్పేడివా? నీకు ఏ అర్హత ఉంది. నీ అడ్రస్ ఏంటో చెప్పు.. మగాడివైతే దమ్ముంటే అడ్రస్ చెప్పు అంటున్నారు. అంతంత పెద్ద మాటలు ఎందుకులే కానీ.. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత ఉందో లేదో తరువాత చూద్దాం. ముందు వెంకట్రావు గురించి మాట్లాడుకుందాం. వెంకట్రావు గారంటే చిరంజీవి గారి తండ్రి. ఆయన మెగాస్టార్ అయ్యారు కాబట్టే.. ఆయన ఫ్యామిలీలో ఉన్న వాళ్లంతా మెగా ఫ్యామిలీ అయ్యారు.

వెంకట్రావు ఉంటేనే మెగాస్టార్ వచ్చారు.. చిరంజీవి మెగాస్టార్ అయ్యారు కాబట్టే.. మెగా ఫ్యామిలీ వచ్చింది. మెగా ఫ్యామిలీలో వెంకట్రావు గారు కూడా భాగమే అని నేను అనుకుంటున్నా.. మరి మీరు కాదనుకుంటున్నారేమో నాకు తెలియదు. వెంకట్రావు గారి గురించి ఆయన అబ్బాయి పవన్ కళ్యాణ్‌గారు ఏమన్నారంటే.. మా నాన్న దేవుడి దీపంతో సిగరెట్ వెలిగించుకునేవారని. నీనైతే ఇది నమ్మను. ఎందుకంటే.. వెంకట్రావు గారు నాకు తెలుసు. నేను చిరంజీవి గారితో మొదట్లో రెండు సినిమాలు తీశాను. వెంకట్రావు గారు నాకు బాగా తెలుసు.. మంచి వ్యక్తి. ఆయన ఇలాంటి పనులు చేసి ఉంటారని నేను అయితే అనుకోను. ఒకవేళ ఆయన అలా చేసినా కూడా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని చెప్పకూడదు. ఎందుకంటే.. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి.

బతికి ఉన్న మనిషి గురించి ఏం చెప్పినా పర్లేదు. కానీ చనిపోయిన తన కన్న తండ్రి గురించి కొడుకు ఇలా చెప్పడం అనేది తప్పు. ఫ్యామిలీని బయటకు లాగింది ఎవరు? తన తండ్రి గురించి చెప్పి మెగా ఫ్యామిలీని బయటపెట్టింది.. బయటకు లాగింది పవన్ కళ్యాణే. మెగా ఫ్యామిలీని రోడ్డు మీదికి లాగింది పవన్ కళ్యాణ్ అయితే.. తప్పని చెప్పింది నేను. తప్పని చెప్పినందుకు ఇప్పుడు నా అడ్రస్ అడుగుతున్నారు. నన్ను వచ్చి వచ్చి ఏం చేస్తారో మరి.. అడ్రస్ చెప్తే ఏం చేస్తారు.. అది వేరే సంగతి కానీ.. తరువాత చూసుకుందాం.

మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు అర్హత నాకు లేదన్నప్పుడు.. సొంతవాళ్లకి తన కుటుంబం పట్ల సొంత వ్యక్తుల పట్ల బాధ్యత ఉండాలి కదా.. అదే నేను చెప్పాను. నేను ఎప్పుడూ పర్సనల్ కామెంట్స్ చేయను. పవన్ మాట్లాడిన దాంట్లో తప్పు ఉందనే నేను చెప్పాను. మరి వీళ్లకి ఏం అర్ధమైందో తెలియడం లేదు.. నన్ను అడ్రస్ అడుగుతున్నారు. బెదిరిస్తున్నారు.. మెసేజ్‌లు పెడుతున్నారు.. ఫోన్లు చేస్తున్నారు.. రకరకాలుగా చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. చిరంజీవి గారితో నేను రెండు సినిమాలు తీశాను. కోతల రాయుడు, మొగుడు కావాలి వంటి సినిమాలు తీశాను.

సొంత అన్నదమ్ముల్లా ఉన్నాం. మెగా ఫ్యామిలీ అంటే నేను నా ఫ్యామిలీలాగే ఫీల్ అవుతా. మెగా ఫ్యామిలీని వేరే ఫ్యామిలీ అని నేను అనుకోను. మెగా ఫ్యామిలీలో వెంకట్రావుగారిని అన్నా.. చిరంజీవిగారిని అన్నా… నాగబాబుగారిని అన్నా.. పవన్ కళ్యాణ్‌ని అన్నా నేను హర్ట్ అవుతాను. మొన్నటి మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రాలోకి రానివ్వం అని ఎవరో అంటే.. ‘మీరుఎవరు రానివ్వకపోవడానికి? అని వీడియో పెట్టాను. మరి మీరు ఆ వీడియో చూశారో లేదో తెలియదు. నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని కూడా వీడియోలు పెట్టాను. మరి ఆరోజున వీళ్లంతా ఎందుకు మాట్లాడలేదు.. అప్పుడొచ్చి నా అడ్రస్ ఎందుకు అడగలేదు’ అంటూ పవన్ ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *