దేశంలో అత్యధిక అప్పులున్న మంత్రుల టాప్ 10 జాబితాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేరారు. 27 కోట్ల 73 లక్షల 15 వేల 880 రూపాయల అప్పులతో.. జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు కేటీఆర్. అయితే.. దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మంత్రి మండలిపై ఏడీఆర్ అనే వెబ్‌సైట్ ఓ రిపోర్టు విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించే అఫిడవిట్‌ల ఆధారంగా.. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారి క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను ఓ రిపోర్ట్ రూపంలో విడుదల చేసింది ఏడీఆర్ వెబ్‌సైట్. ఈ రిపోర్టుతో కేటీఆర్‌కు ఉన్న ఆస్తులెన్ని, అప్పులెన్ని అనే వివరాలు కూడా ఉండటంతో.. అసలు విషయాలన్ని బయటపడ్డాయి. కాగా.. కేటీఆర్‌కు మొత్తం 41 కోట్ల 82 లక్షల 94 వేల 428 రూపాయల ఆస్తి ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. అయితే.. 283 కోట్లకు పైగా అప్పులతో మహారాష్ట్రకు చెందిన మంగళ్ ప్రభాత్ లోదా అనే మంత్రి అగ్రస్థానంలో నిలిచారు. అయితే.. మొదటి నాలుగు స్థానాల్లో బీజేపీకి చెందిన మంత్రులే ఉండటం గమనార్హం.
అయితే.. కేటీఆర్‌కు చెందిన అప్పుల వివరాలు బయటకు రావటానికి పెద్ద కథే ఉంది. ఫిబ్రవరి 2న ఓ వార్త హల్చల్ అయ్యింది. టాప్-10 ధనవంతులైన మంత్రుల జాబితాలో కేటీఆర్ ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టారు. కొన్ని దినపత్రికలు సైతం ఈ వార్తను ప్రచురించాయి. దీంతో.. ఈ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యింది. అయితే.. ఇందులో కేటీఆర్‌తో పాటు ఏపీ సీఎం జగన్ పేరు కూడా ఉండటం గమనార్హం.
దీంతో.. ఈ వార్త ఎంత వరకు నిజం అన్నదానిపై కొన్ని వెబ్‌సైట్లు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. మంత్రుల జాబితాలో కేటీఆర్ టాప్- 10 స్థానంలో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. అది ధనవంతుల్లో కాదు.. అత్యధిక అప్పులున్న మంత్రుల లిస్టులో. ఈ విషయం తర్వాత తెలియటంతో.. ఈ వార్తను ప్రచురించిన వెబ్‌సైట్లు, దినపత్రికలు తీరిగ్గా సవరణ కూడా ముద్రించారు.
మొత్తానికి కేటీఆర్ మాత్రం ధనవంతుల మంత్రుల జాబితాలో లేరు అన్నది స్పష్టమైంది. అయితే.. ఆయనకు అన్ని కోట్లు అప్పులున్నాయా అన్నది ఇప్పుడు శ్రేణుల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఆస్తులు కూడా గట్టిగానే ఉన్నాయంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
97579027
Read More Telangana News And Telugu News