అమెరికా ఆందోళన రెట్టింపు.. మరోచోట చైనా గూఢచర్య బెలూన్ గుర్తింపు

చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్‌ను తమ గగనతలంలో గుర్తించినట్లు అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం మరో బెలూన్‌ లాటిన్ అమెరికాలో గుర్తించినట్టు పెంటగాన్ వెల్లడించింది. ఈ పరిణామాలతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. చైనా పర్యటన రద్దయ్యింది. మొదటి గుర్తించిన బెలూన్ ప్రస్తుతం మధ్య అమెరికా మీదుగా తూర్పు దిశలో ప్రయాణిస్తోందని, భద్రతా కారణాల దృష్ట్యా దానిని కూల్చివేయలేదని పేర్కొంది. లాటిన్ అమెరికా గుండా బెలూన్ ఎగురుతున్నట్టు వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ‘‘మేము ప్రస్తుతం మరో చైనా గూఢచర్య బెలూన్‌ గురించి అంచనా వేస్తున్నాం’’ అని ప్రకటించింది.

మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్‌ విమానాల కన్నా ఎత్తులో ప్రయాణిస్తోందని పెంటగాన్ వెల్లడించింది. ఈ విషయాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లినట్లు అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని గంటల్లో చైనాకు బయలుదేరాల్సి ఉన్న విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్‌ తన పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకుంది. భద్రతాపరంగా సున్నితమైన స్థావరాల మీదుగా ప్రయాణిస్తున్న ఈ బెలూన్‌ను కొన్ని రోజులుగా అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది.

ఇదే అంశంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో బ్లింకేన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంఘటన గురించి తమ మధ్య ప్రశాంతంగా, వృత్తిపరంగా చర్చ జరిగిందని వాంగ్ చెప్పారు. ‘‘చైనా బాధ్యతాయుతమైన దేశం.. అంతర్జాతీయ చట్టాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.. మేము ఎటువంటి నిరాధారమైన ఊహాగానాలు, హైప్‌లను అంగీకరించం.. తప్పుడు నివేదికలను నివారించి, విభేదాలను పరిష్కరించుకుందాం’’ అని పిలుపునిచ్చారని చైనా అధికార పత్రిక జున్హువా తెలిపింది.

ఆ బెలూన్ ఒక ‘పౌర గగననౌక’ అని, వాతావరణ పరిశోధనల కోసం దానిని తామే ప్రయోగించామని చైనా స్పష్టం చేసింది. గాలుల ప్రభావంతో పాటు, స్వయంచోదక సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల దిశ మార్చుకుని అమెరికా గగనతలంలోకి పొరపాటున వచ్చిందని వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై చింతిస్తున్నట్లు చైనా పేర్కొంది. అయితే ఈ స్పందనతో అమెరికా సంతృప్తి చెందలేదు. మరింత సమగ్రమైన వివరణ కోసం అగ్రరాజ్యం పట్టుపడుతోన్న తరుణంలో రెండో బెలూన్ ప్రత్యక్షకావడం గమనార్హం.

ఈ బెలూన్‌ అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానా గగనతలంలో ఉండటంతో అమెరికా అప్రమత్తమయింది. దాడి చేసి కూల్చేస్తే ఆ శకలాలు ప్రజలపై పడే అవకాశం ఉండడంతో ఆ ఆలోచనను అధికారులు విరమించుకున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

Read Latest International News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *