Akunuri Murali: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంతో అదానీ ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదానీ భారీ మోసానికి పాల్పడ్డాడరంటూ విపక్షాలు సైతం పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. అదానీపై హిండెన్ బర్గ్ నివేదిక బీజేపీ, మోదీ మార్కు అవినీతికి నిదర్శనమని మండిపడ్డారు. అవినీతి చేసిన ఇన్ని లక్షల కోట్లతో దేశంలో పేదరికాన్ని పూర్తిగా తీసేయెుచ్చునని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ, కార్పొరేట్ దొంగలు దేశాన్ని పేదదిగా మారుస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. అదానీ గ్రూపుల వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేస్తూ 16 విపక్ష పార్టీలు ఏకతాటిపై వచ్చాయి. ఉభయసభల్లో ఈ ఇష్యూపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించాయి. అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదికపై సమగ్ర విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)ని ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ సభ్యులు ఆదివారం పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు. లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. అదానీ గ్రూపుపై చర్చించాలని బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయితే ప్రభుత్వం చర్చకు అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్, ఆప్ సహా పలు పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు.
అదానీ సెగ తెలంగాణ అసెంబ్లీని కూడా తాకింది. అదానీ ఇష్యూ, రాష్ట్రంలో ఐటీ దాడులపై అధికార పార్టీ ఎమ్మెల్యే వివేకానంద శాసనసభలో ప్రస్తావించారు. ప్రతిగా బీజేపీ సభ్యులు ఎదురుదాడి చేశారు. దీంతో సభలో కాసేపు వాగ్వాదం నెలకొంది. ప్రధానమంత్రి సన్నిహితులకు చెందిన సంస్థలపై ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని కష్టపడి ఎదిగిన వారిని దాడుల పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు ఉద్దేశపూర్వకమైనవేనని ఆయన విమర్శించారు.
97600152
Read More Telangana News And Telugu News