ఐదేళ్ల నుంచీ ఒంటరిగా ఉంటోన్న వాణీ జయరాం.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

దిగ్గజ గాయని వాణీ జయరాం (Vani Jairam) మృతిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. శనివారం తన ఇంట్లో వాణీ జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే.

2018లో భర్త జయరాం మృతిచెందిన దగ్గర నుంచీ చెన్నైలోని హడోవ్స్ రోడ్‌లో ఉన్న తన ఇంట్లో వాణీ జయరాం ఒంటరిగా ఉంటున్నారు. మాలార్‌కోడి అనే పనిమనిషి ఆమె వద్ద పనిచేస్తోంది. రోజూ వాణీ జయరాం ఇంటికి వెళ్లి పనులన్నీ చూసుకుంటుంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 11 గంటలకు వాణీ జయరాం ఇంటికి వెళ్లిన మాలార్‌కోడి కాలింగ్ బెల్ కొట్టింది. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం నుంచి స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని ఆమె వెంటనే వాణీ జయరాం సోదరి ఉమాకు చెప్పారు.

ఉమ, మాలార్‌కోడి కలిసి డూప్లికేట్ తాళంచెవితో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూశారు. బెడ్‌రూంలో వాణీ జయరాం రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ఆందోళనకు గురయ్యారు. వాణీ జయరాం నుదిటిపై గాయాలు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వాణీ జయరాం మృతిచెందడంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని కిల్పాక్ హాస్పిటల్‌కు పోలీసులు తరలించారు. ఆ తరవాత తమిళనాడు పోలీసులకు చెందిన ఫోరెన్సిక్ టీమ్ వాణీ జయరాం ఇంటికి వెళ్లి ఇన్స్‌పెక్షన్ నిర్వహించారు.

వాణీ జయరాం మృతిని అనుమానాస్పదంగా భావిస్తూ కేసు నమోదు చేశామని ట్రిప్లికేన్ డీసీపీ శేఖర్ దేశ్‌ముఖ్ చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరవాత వాణీ జయరాం మృతికి కారణాలేంటో తెలుస్తాయని వెల్లడించారు.

సంగీతాన్ని, సాహిత్యాన్ని, కళాత్మక చిత్రాలను అమితంగా ప్రేమించే ప్రేక్షకులు కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటిది, ఆయన శివైక్యం అయిన కొన్ని గంటల్లోనే మరో గొప్ప కళాకారిణి వాణీ జయరాంను కోల్పోవడం సంగీత ప్రియులకు తీరని లోటు. వాణీ జయరాం గొప్ప గాయని అయినా ఆమెకు రావాల్సినంత గుర్తింపు రాలేదనేది చాలా మంది విమర్శకుల వాదన. అయితే, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం వాణీ జయరాంకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కానీ, ఆ పురస్కారాన్ని స్వీకరించకుండానే వాణీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

78 ఏళ్ల వాణీ జయరాం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మలయాళం, మరాఠీ సహా 19 భారతీయ భాషల్లో 10 వేలకు పైగా పాటలు పాడారు. వీటిలో 100 హిందీ చిత్రాలకు పాడిన 339 పాటలు ఉన్నాయి. మూడు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత అయిన వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. ఎనిమిదేళ్ల వయసులోనే ఆల్ ఇండియా రేడియోలో పాట పాడిన వాణి.. ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. భర్త ప్రోత్సాహంతో ప్రొఫెషనల్ ప్లే బ్యాంక్ సింగర్ అయ్యారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *