ఒక్క సోషల్ మీడియా పోస్ట్.. పదేళ్ల బాధను తీర్చింది..!

Naveen Kumar, News18, Nagarkurnool

కొన్ని మిస్సింగ్ కేసులు విచిత్రంగా ఉంటాయి.తప్పిపోయిన ఎన్నో ఏళ్లకు కానీ వాళ్లు మళ్లీ తిరిగి తమ వారిని వెతుక్కుంటూ వస్తుంటారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా.. ఎంత గాలించినా దొరకదు. అయితే, నేటి కాలంలో సోషల్ మీడియా (Social Media) ద్వారా ఒకటవుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమ వారు ఎక్కడున్నా రావాలని బంధువులు కుటుంబ సభ్యులు కోరగా చాలామంది ఆ పోస్టును వైరల్ చేస్తున్నారు. దీంతో ఎక్కడో ఒక దగ్గర ఫేస్ బుక్ (Facebook), వాట్సప్ (Whats App), ట్విట్టర్ (Twitter) ద్వారా ఆ వ్యక్తికి ఈ సందేశం చేరి తమ వారిని వెతుక్కుంటూ వస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి.

పోలీసులు ఎన్ని విచారణలు చేపట్టినప్పటికీ లభించని తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా ఫలితాలు ఉంటున్నాయి. ఇలాంటి ఘటన నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) పదర మండలంలో చోటుచేసుకుంది. మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి ఆచూకీ పదేళ్ల తర్వాత లభ్యమైంది.

ఇది చదవండి: ఎంతిచ్చినా సరిపోలేదంట.. పెళ్లైన పదేళ్ల తర్వాత కూడా..!

మండలంలోని వంకేశ్వరం గ్రామానికి చెందిన కొయ్యల వైకుంఠం (54)కు భార్య పార్వతమ్మ, కుమారుడు రంజిత్, కూతుర్లు అనిత, అరుణలు ఉన్నారు. మతిస్థిమితం కోల్పోయిన వైకుంఠం పదేళ్ల క్రితం ఉన్నట్టుండి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం మానేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదయి 10 ఏళ్లు గడుస్తుంది. అయినా కూడా ఆచూకీ లభించలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. రేడియో హోమ్స్ రమేష్ పేరుతో ఈ వార్త వైరల్ అయింది.

అందులో కోల్ కతా సమీపంలో బెహరంపూర్ మానసిక చికిత్స ఆలయంలో చికిత్స పొందుతున్న వారిలో వైకుంఠం కనిపించాడు. గుర్తుపట్టిన గ్రామస్తులు, బంధువులు కుటుంబీకులు సమాచారం ఇచ్చారు. అతను తమ వద్దకు రప్పించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కనీసం హైదరాబాద్ వరకు తెచ్చిన తమ తండ్రిని తాము కలుసుకోగలమని వేడుకుంటున్నారు. కలకత్తా వరకు వెళ్లి వారిని తీసుకొని వచ్చే ఆర్థిక స్తోమత వీరికి లేకపోవడంతో దాతలను, అదేవిధంగా అధికారులను, ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేస్తున్నారు.తప్పిపోయిన తమ కుటుంబ పెద్దను తమకు దరిచేరేలా చేయాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *