కేసీఆర్‌తో పలు రాష్ట్రాల ముఖ్య నేతలు భేటీ.. బీఆర్ఎస్‌లో చేరేందుకు సంసిద్ధత

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు నాయకులు ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. అయితే.. వీరంతా బీఆర్ఎస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రి చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పసుల సమ్మయ్య, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు వంటి పథకాల విధివిధానాలపై కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

వాటితో పాటు రాష్ట్రంలో నిర్వహిస్తోన్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి కోసం చేస్తున్న ఇతర కార్యక్రమాల వివరాలపై లోతుగా చర్చించారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించడాన్ని నేతలు ఆహ్వానించారు. దేశంలో ప్రస్తుతం కేసీఆర్ లాంటి ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం అవసరం ఉందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించిన నాయకులు.. పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కేసీఆర్‌కు నేతలు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత.. రేపు తొలిసారిగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సభను పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాగా.. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలు కేసీఆర్‌తో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

97586440

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *