తెలంగాణ రాష్ట్రాన్ని పసి పాపలా చూసుకుంటున్న : గవర్నర్ తమిళిసై
సికింద్రాబాద్/ హైదరాబాద్, వెలుగు: తాను గైనకాలజిస్టునని.. చిన్న పిల్లలను ఎట్ల కేర్ చేస్తామో, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అట్లనే చూసుకుంటున్నానని గవర్నర్ తమిళిసై అన్నారు. ఐసీఎంఆర్,- ఎన్ఎస్ఐఎన్ సహకారంతో బీబీనగర్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్(ఐఏపీఎస్ఎం) 50వ వార్షిక గోల్డెన్ జూబ్లీ మూడ్రోజుల జాతీయ సదస్సు గురువారం తార్నాకలోని ఎన్‌ఐఎన్‌లో ప్రారంభమైంది. దీనికి గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కరోనా టైమ్‌లో హెల్త్ పట్ల తీసుకున్న జాగ్రత్తలే ఎప్పుడూ కొనసాగించాలని ప్రజలకు ఆమె సూచించారు.. ఇప్పటికీ చాలా మారుమూల గ్రామాల్లో వ్యాధులు సోకిన వారికి సరైన చికిత్స అందడం లేదన్నారు. జీ-20 సదస్సును స్ఫూర్తిగా తీసుకుని ‘వన్ ఎర్త్ వన్ హెల్త్’కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ట్రైబల్ మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని చెప్పారు. కరోనా టైమ్‌లో డాక్టర్లు అందించిన సేవలను గవర్నర్ అభినందించారు. సైంటిస్టుల అంకితభావం, నిబద్ధతతో మన దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్‌ను 150 దేశాలకు ఎగుమతి చేయడం గర్వకారణమన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ.. ఈ ఏడాది ‘ప్రజారోగ్యం ఆవిష్కరణలు ఆత్మపరిశీలన, వన్ హెల్త్ వన్ ప్లానెట్’అనే థీమ్‌తో ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని వివరించారు. అనంతరం సదస్సు సావనీర్ ఆవిష్కరించారు. పలువురికి అవార్డులు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లతో పాటు దేశవ్యాప్తంగా 1,200 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.
©️ VIL Media Pvt Ltd.