పేదల పెన్షన్లపై కన్ను.. వీళ్ల దోపిడీకి అంతేలేదా..?

Naveen Kumar, News18, Nagarkurnool

ప్రభుత్వ ఉద్యోగుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లంచాల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్ములు సరిపోక ప్రభుత్వం నుంచి ప్రజలకు వస్తున్న సంక్షేమ పథకాల సొమ్మును కూడా స్వాహా చేస్తున్నారు. ఇలాంటి అధికారులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. కొల్లాపూర్ లో పంచాయతీ నిధులను ఉద్యోగి స్వాహా చేయగా.., ఉట్నూరు మండలంలో మరో ఉద్యోగం చనిపోయిన పెన్షన్ డబ్బులను కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా (Narayanapeta District) ఉట్నూరు మండలంలో చనిపోయిన వ్యక్తుల సాక్షిగా ఆసరా పెన్షన్ డబ్బులను పోస్టల్ బిపిఎం స్వాహా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నపార్ల గ్రామంలోని డిఎల్పిఓ సుధాకర్ రెడ్డి ఇచ్చిన వివరాల మేరకు చిన్నపార్లకు చెందిన 550 మంది వివిధ కారణాలతో వివిధ రకాల పింఛన్లను పొందుతున్నారు.

దాదాపుగా రెండున్నరేళ్ల కిందట చనిపోయిన వ్యక్తులను అధికారుల జాబితా నుంచి తొలగించలేదు. దీనిని ఆసరాగా చేసుకున్న పోస్టల్ బిపిఎం రుక్కమ్మ, పంచాయతీ కార్యదర్శి శివలీల ఫింగర్ప్రింట్ సహాయంతో ఆమెకు తెలియకుండా మృతుల ఆసరా డబ్బులను కాజేస్తూ వచ్చింది. కాగా పింఛన్ పొందుతూ కుటుంబ యజమాని చనిపోతే వారి స్థానంలో భార్యకు వితంతు పింఛన్ అందించేలా ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. దరఖాస్తు అందిన 15 రోజుల్లో పింఛన్ ఇవ్వాలని గ్రామపంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు చనిపోయిన భర్తల స్థానంలో తమకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ కొందరు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు ఇచ్చారు. విచారణ నిమిత్తం రికార్డులను పరిశీలించిన కార్యదర్శికి అసలు విషయం తెలిసింది.

ఇది చదవండి: ఆ జిల్లాలో నీళ్లు నిల్.. లిక్కర్ మాత్రం ఫుల్.. సందు సందులోనూ మందు

ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియకుండానే డబ్బు రికవరీ చేస్తున్నారు. సమాచారం తెలిసిన గ్రామస్తులు గత సోమవారం కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డిఎల్పిఓ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో కాశప్ప, ఎంపిఓ వేణుగోపాల్ రెడ్డి గ్రామానికి చేరుకొని స్థానికులతో సమావేశం అయ్యారు. చనిపోయిన చాకలి నారాయణ పేరుపై 30 నెలల పింఛన్ 60,480, అబ్దుల్ రెహమాన్ పేరిట 29 నెలలు రూ.58,464, మహమ్మద్ యూసుఫ్ పేరిట 23 నెలలు 46,368 రూపాయలు, హలీసబ్ పేరిట 23 నెలలు రూ.46,988 , ఉస్మాన్ పేరిట 15 నెలలు పింఛన్ రూ.30,240 బీపీఎం రుక్కమ్మ స్వాహా చేసినట్లు విచారణలో తేలింది.

మొత్తం రూ.2,41, 920 దుర్వినియోగానికి పాల్పడగా వీటిలో 1,83,456 పంచాయతీ కార్యదర్శి రికవరీ చేసి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన బీపీఎం పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్కు నివేదనను డిపిఓ ఇచ్చారు. గ్రామంలో చనిపోయిన ఆసరా లబ్ధిదారుల వివరాలతో పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *