దొంగతనం కేసులో పట్టుబడ్డ ఓ యువకుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పక్కా ప్రణాళిక వేశాడు. మరో నిందితుడిని పట్టిస్తానని చెప్పి పోలీస్ జీపును ఓ ప్రవాహం వెంట ఉన్న దారి మీదుగా వెళ్లేలా చేశాడు. తాను అనుకున్న ప్రదేశానికి రాగానే, పోలీసులను మాటల్లో పెట్టి, వాహనం నెమ్మదిగా వెళ్లేలా చేసి, సంకెళ్లు తెంచుకొని కిందకు దూకేశాడు. రెప్పపాటులో పక్కనే ఉన్న ప్రవాహంలోకి దూకేశాడు. పోలీసులు ఎంతగా గాలించినా అతడి ఆచూకీ చిక్కలేదు. 36 గంటలు దాటింది. ఈతలో ఆరితేరిన ఆ నిందితుడు ప్రవాహం దాటుకొని పారిపోయాడా? లేదా నది నీటిలో మునిగిపోయి గల్లంతయ్యాడా? అనేది అంతుచిక్కడం లేదు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో వెలుగులోకి వచ్చింది.
నెల్లూరు గ్రామీణ మండలంలో కొన్ని రోజులుగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి బంగారు ఆభరణాలను దోచుకుంటున్న గ్యాంగ్.. పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు.. ఉప్పుటూరుకు చెందిన గిరి, మరొకరిని గత ఆదివారం అరెస్ట్ చేశారు. విచారణ ప్రక్రియలో భాగంగా వీరిని బుధవారం రాత్రి ఏఎస్ పేటకు తీసుకెళ్లారు. తిరిగి నెల్లూరు వస్తుండగా నిందితుడు గిరి పారిపోయేందుకు ఓ పథకం వేశాడు.
తనతో కలసి దొంగతనాల్లో పాల్పడే మరో వ్యక్తి, సంగంలోని కొండ ప్రాంతంలో ఉంటాడని పోలీసులను నమ్మించాడు. అతన్ని కూడా పట్టుకోవచ్చని పోలీసులు తమ వాహనాన్ని అటు వైపు మళ్లించారు. పోలీస్ జీప్ ఆత్మకూరు వెళ్లే మార్గంలో బీరాపేరు వాగు పెన్నా నదిలో కలిసే ప్రాంతానికి చేరుకోగానే.. పోలీసులను మాటల్లో పెట్టి వాహనం నెమ్మదిగా వెళ్లేలా చేశాడు గిరి. జీపులో ఉన్న తోటి నిందితుడి సాయంతో తనకు వేసిన సంకెళ్లను తొలగించుకొని వాహనంలోంచి కిందికి దూకేశాడు. పోలీసులు తేరుకునే సరికి పక్కనే ఉన్న వాగులోకి దూకేశాడు.
పోలీసులు కూడా వాగులోకి దిగి నిందితుడి వెంటపడ్డారు. దీంతో నిందితుడు గిరి వాగులో మరింత లోతుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడి జాడ కనిపించలేదు. గజ ఈతగాళ్లతో గాలించినా ఫలితం లేదు.