మెమరీ లాస్‌తో బాధపడుతున్నాను.. ఆ రూమర్లన్నీ అవాస్తవం: భానుప్రియ

నటి భానుప్రియ (Bhanupriya) పేరు చెప్పగానే ఆమె అందమైన, అమాయకంగా చూసే కళ్లు గుర్తొస్తాయి. నెమలిలా ఆమె చేసే నాట్యం మన కళ్ల ముందు ఆడుతుంది. 80ల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ.. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కిందటేడాది వరకు సినిమాలు చేసుకుంటూ వచ్చారు. వాటిలో ఎక్కువగా అమ్మ పాత్రలే చేశారు. కాకపోతే, ఏడాదికి ఒకటిరెండు సినిమాలు తప్ప ఎక్కువగా చేయలేదు. ఇక ఇప్పుడైతే ఆమె ఏ సినిమాలూ ఒప్పుకోలేదట. దీనికి కారణం జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అని భానుప్రియ చెబుతున్నారు. ఈ మేరకు ఆమె తెలుగు వన్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి, తన ఆరోగ్యం గురించి పలు విషయాలు వెల్లడించారు.

భానుప్రియ క్లాసికల్ డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఆమె ఒక డాన్స్ స్కూల్ కూడా పెడదామని అనుకున్నారు. కానీ, ఐదేళ్ల క్రితం భానుప్రియ భర్త ఆదర్శ్ కౌశల్ కన్నుమూయడంతో ఆమె కాస్త విషాదంలో కూరుకుపోయారు. ఆ తరవాత కొన్నాళ్ల నుంచి తనకు ఆరోగ్యం బాగుండడం లేదని.. మెమరీ లాస్‌తో బాధపడుతున్నానని భానుప్రియ చెప్పారు.

‘‘ఈ మధ్య కాలంలో నాకు ఒంట్లో బాగోలేదు. మెమరీ పవర్ తగ్గిపోయింది. నేర్చుకున్న కొన్ని ఐటమ్స్ మరిచిపోయాను. తరవాత డాన్స్ మీద ఆసక్తి తగ్గింది. ఇంట్లో కూడా నేను డాన్స్ ప్రాక్టీస్ చేయట్లేదు’’ అని భానుప్రియ చెప్పారు. గత రెండేళ్లుగా మెమరీ లాస్‌తో బాధపడుతున్నానని.. ఈ మధ్య ఒక సినిమా లొకేషన్‌లో డైలాగులు మరిచిపోయానని భానుప్రియ చెప్పారు. గుర్తుపెట్టుకోవాల్సిన చాలా విషయాలను తాను మరిచిపోతున్నానని వెల్లడించారు.

‘‘సిల నేరంగిలిల్ సిల మనిధర్గల్ అనే తమిళ సినిమాలో యాక్ట్ చేశాను. లొకేషన్‌లోకి వెళ్లి యాక్షన్ అనగానే డైలాగులన్నీ మరిచిపోయాను. మైండ్ బ్లాంక్ అయిపోయింది. మళ్లీ నేను సర్దుకున్నాక షూట్ చేశారు’’ అని భానుప్రియ తెలిపారు. తాను ఎలాంటి ఒత్తిడికి కానీ, డిప్రెషన్‌కు కానీ లోనుకావడం లేదని స్పష్టం చేసిన భానుప్రియ.. ఆరోగ్యం బాగోకపోవడం వల్లే మరిచిపోతున్నానని అన్నారు. దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నానని చెప్పారు.

ఇక భర్తతో భానుప్రియ ఎప్పుడో విడిపోయారని వచ్చే వార్తలపై కూడా ఆమె స్పందించారు. ‘‘మేం విడిపోలేదు. ఆయన హైదరాబాద్‌లో ఉండేవారు. నేను చెన్నైలో ఉండేదాన్ని. నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే ఇక్కడికి వచ్చి యాక్ట్ చేసేదాన్ని. ట్రావెలింగ్ ఎక్కువగా ఉండేది. నా భర్తతో విడిపోయానని వచ్చినవన్నీ రూమర్స్ మాత్రమే. నిజం కాదు. నా భర్తతో నేను విడాకులు తీసుకోలేదు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది’’ అని భానుప్రియ వివరణ ఇచ్చారు.

తన ఏకైక కూతురు అభినయ గురించి కూడా భానుప్రియ మాట్లాడారు. ‘‘అభినయ ఇప్పుడు కాలేజ్‌కు వెళ్తుంది. లండన్‌లోని లాఫ్‌బరో యూనివర్శిటీలో చదువుకుంటోంది. నేచురల్ సైన్స్ అనే సబ్జెక్ట్ తీసుకుంది. కాలేజ్ సెలవులు ఇవ్వగానే ఇక్కడికి వచ్చేస్తుంది. పాపకు ఇప్పుడు వయసు 20 ఏళ్లు’’ అని భానుప్రియ చెప్పారు. తనకు సినిమాలపై ఎలాంటి ఆసక్తి లేదని భానుప్రియ వెల్లడించారు. సినిమాలు చూస్తుంది కానీ.. సినిమాల్లో నటించాలనే ఆసక్తి మొదటి నుంచీ అభినయకు లేదని భానుప్రియ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *