టీమిండియా తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసి.. కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జోగిందర్ శర్మ రిటైరయ్యాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి ఓవర్ బౌలింగ్ చేసిన జోగిందర్.. మిస్బా ఉల్ హక్ వికెట్ తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నానని శర్మ ఓ ప్రకటన ద్వారా తెలిపాడు.
‘‘2002 నుంచి 2017 వరకు నా ప్రయాణం అద్భుతంగా సాగింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా’’ అని జోగిందర్ శర్మ పేర్కొన్నాడు. తన కలను నిజం చేసుకోవడానికి సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, మెంటార్లు, సపోర్ట్ స్టాఫ్‌కు జోగిందర్ ధన్యవాదాలు తెలిపాడు. మీతో కలిసి ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు.
‘‘క్రికెట్ ప్రపంచంలో కొత్త అవకాశాలను వెతుక్కోబోతున్నాను. ఆ రకంగా నాకెంతో ఇష్టమైన ఆటలో మరో రకంగా కొనసాగనున్నాను. నా జీవితంలో కొత్త చాప్టర్ కోసం ఎదురు చూస్తున్నాను’ అనిన జోగిందర్ శర్మ పేర్కొన్నాడు.
2004-07 మధ్య జోగిందర్ శర్మ 4 వన్డేలు, 4 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఐదు వికెట్లు తీశాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ ధోనీ అతడికి అప్పగించాడు. చివరి 4 బంతుల్లో పాక్ విజయానికి 6 పరుగులు అవసరం కాగా.. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. ఈ దశలో స్కూప్ షాట్ ఆడిన మిస్బా ఉల్ హక్ షార్ట్ ఫైన్ లెగ్‌లో శ్రీశాంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ వరల్డ్ కప్‌ను గెలుపొందింది. ఆ తర్వాత జోగిందర్‌కు భారత్ తరఫున ఆడే అవకాశం లభించలేదు. కానీ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో తొలి 4 సీజన్లు ఆడాడు.
ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన జోగిందర్ శర్మ 12 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లో హర్యానా తరఫున ఆడిన జోగిందర్.. 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 80 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 43 టీ20లు ఆడాడు. చివరిగా 2017లో అతడు హర్యానా తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు.
2007 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజయం సాధించడంతో హర్యానా ప్రభుత్వం అతడికి రూ.21 లక్షల నగదు, పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని ప్రకటించింది. 2016లో అతడికి డీసీపీగా ప్రమోషన్ వచ్చింది. కోవిడ్-19 సమయంలో జోగిందర్ శర్మ చురుగ్గా పని చేశాడు. 2022 లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో జోగిందర్ పాల్గొన్నాడు.