వాడీవేడీగా అసెంబ్లీ సమావేశాలు.. సభలో అక్బరుద్దీన్ vs కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. గవర్నర్ ప్రసంగంపై చర్చ సమయంలో సీఎం కేసీఆర్ సభకు రాకపోవడాన్ని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. సమస్యలు చెప్పుకుందామంటే సీఎం గానీ మంత్రులు ఎవరినీ కలవరని ఆరోపించారు. ఆ కారణంగానే తాను బీఏసీకి కూడా రాలేదని అన్నారు. 2014 రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం పాతబస్తీ అభివృద్ధిని విస్మరించిందని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయరని మండిపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం సంగతి ఏమైందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పనులు పాతబస్తీలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. చార్మినార్ పాదాచారుల ప్రాజెక్టు ఇన్నేళ్లుగా జరుగుతుంటే ప్రజలకు ఏం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ మెట్రో ఏమైందని నిలదీశారు. పాతబస్తీని ఇస్తాంబుల్ లా మారుస్తానన్న సీఎం కేసీఆర్ హామీని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. పాతబస్తీని ఇస్తాంబుల్ లా మార్చకపోయినా పర్వాలేదు కనీసం అభివృద్ధి చేస్తే చాలని అన్నారు. నాలుగున్నరేళ్లలో కేవలం 64 రోజులు మాత్రమే సభ జరిగిందని, చరిత్రలో ఇంత తక్కువ రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరగడం ఇదే మొదటిసారని అన్నారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఇంతకన్నా ఎక్కువ సమయం ఇవ్వడం సబబు కాదని అన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదన్న ఆయన… సభా నాయకుడు బీఏసీకి రాలేదని నిందా పూర్వకంగా మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వం తరపున నలుగురు మంత్రులు బీఏసీ కి వెళ్లిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. బీఏసీకి రాకుండా రాకుండా ప్రభుత్వాన్ని నిందించడం భావ్యం కాదని అన్నారు తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయంటున్న అక్బరుద్దీన్ రెండేళ్ల పాటు కోవిడ్ ఉందన్న విషయం మర్చిపోయినట్టున్నారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
కేటీఆర్ కామెంట్స్ కు అక్బరుద్దీన్ సమాధానంగా… తానేమీ కొత్త సభ్యున్ని కాదని, మీకు సహనం తక్కువవుతోందని విమర్మించారు. పొగిడితే ఎంతసేపైనా వినేందుకు సిద్ధంగా ఉన్న కేటీఆర్ విమర్శల్ని మాత్రం తట్టుకోలేరని అన్నారు. ఆ వెంటనే కల్పించుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. అక్బర్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అక్బర్ కే సహనం తగ్గి, కోపం వస్తోందని కామెంట్స్ చేశారు.
©️ VIL Media Pvt Ltd.