రోడ్డు ప్రమాదాలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. మోటర్ వెహికల్ యాక్ట్(Motor Vehicle Act)ని ఫాలో కావడం లేదు. ఇలా ఎందుకు అంటున్నామంటే బీహార్( Bihar)లో ఓ బైకర్ తన టూ వీలర్(Two wheeler)ని సెవన్ సిట్టర్ ఆటోగా మార్చాడు. ఇద్దరు కంటే ఎక్కువ మంది కూర్చొవడానికి అవకాశం లేని బైక్‌పై తనతో పాటు మరో ఆరుగుర్ని ఎక్కించుకొని వెళ్తుండటం అక్కడున్న వారినే కాదు..అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బంకా జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో(video) నెట్టింట్లో విస్తృతంగా వైరల్ ( viral)అవుతోంది. సదరు వాహనదారుడ్ని గుర్తించారు అధికారులు.
Viral Video: పెళ్లి కొడుకు ఊరేగింపు వీడియో వైరల్ .. వధువు ఇంటికి దేనిపై వచ్చాడో తెలుసా..?
బీహార్‌లో బైకర్ దుస్సాహసం..
కారులో లేదంటే షేర్ ఆటోలో ఆరుగురు లేదా ఏడుగురు కూర్చుంటారు. కాని ఒక బైక్‌పైనే ఏడుగురు కూర్చున్నారు. బీహార్‌కు చెందిన ఓ బైకర్ ఇంతటి సాహసం చేశాడు. బంకా జిల్లాలోని భాగల్‌పూర్-హన్స్‌దిహా ప్రధాన రహదారిలో ఉన్న బౌన్సీలో ఓ బైక్ నడుపుతున్న వ్యక్తి తనతో పాటు ముగ్గురు చిన్నపిల్లలతో పాటు మరో వ్యక్తిని బైక్‌పై కూర్చొబెట్టుకున్నాడు. అంటే మొత్తం ఐదుగురు. ముగ్గురు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్లు బైక్‌పైన ఇరుకు ఇరుకుగా కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత మరో మహిళ పసిపాపను ఎత్తుకొని వచ్చి బైక్ సీటుపై కూర్చుంది. ఒక్క టూవీలర్‌పై ఏడుగురు కూర్చున్నారు. ఈ వింతను అక్కడ మార్కెట్‌కు వచ్చిన వాళ్లంతా చూసి ఆశ్చర్యపోయారు. తమ సెల్‌ఫోన్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఇప్పుడు ఈ వీడియో విశ్వవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
బైక్‌పై ఏడుగురు..
ఆరుగుర్ని బైక్ ఎక్కించుకున్న వ్యక్తి ఏదో విధంగా అందర్ని తీసుకొని తన గమ్యస్థానం వైపు వెళ్లిపోయాడు. అయితే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు. వాహనదారుల్ని హెల్మెట్ మాత్రమే అడిగే ట్రాఫిక్ పోలీసులకు ఇలాంటి వాహన నిబంధనలు పాటించని వారు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు.
ఇలాంటి వారిపై చర్యలు తప్పవు..
అయితే ఈవీడియో వైరల్ కావడంతో స్థానిక ట్రాఫిక్ అధికారి స్పందించారు. ఇద్దరు మాత్రమే ప్రయాణించాల్సిన బైక్‌పై ఏడుగురు వెళ్లడం నేరమని ఇలా నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపడం వల్ల అందరికి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు వినియోగదారుల ప్రాణ, ఆస్తుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు రూపొందించినట్లుగా ఆయన తెలిపారు.