Men Health: మగవాళ్లు 40 దాటిన తర్వాత.. ఈ వైద్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలి.

Men Health:  పురుషులు నలభై ఏళ్లు దాటిన తర్వాత.. ఏడాదికి కనీసం ఒకసారైనా వైద్యపరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మగవారు 40 ఏళ్లు దాటిన తర్వాత.. చేయించుకోవలసిన వైద్య పరీక్షలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Men Health: ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. వైద్య పరీక్షల విషయంలోనూ అశ్రద్ధ వహిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో మహిళలతో పోలిస్తే.. పురుషులు మరింత వెనుకబడి ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. పురుషులు నలభై ఏళ్లు దాటిన తర్వాత.. ఏడాదికి కనీసం ఒకసారైనా వైద్యపరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మగవారు 40 ఏళ్లు దాటిన తర్వాత.. చేయించుకోవలసిన వైద్య పరీక్షలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బ్లడ్‌ షుగర్‌ టెస్ట్‌..

డయాబెటిస్‌ ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఒబేసిటీ ఉన్నా, కుటుంబసభ్యుల్లో ఎవరికైనా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి ఎక్కువగా ఉన్నా, వయసు పెరిగేకొద్దీ మధుమేహానికి దగ్గర అవుతున్నట్టే. కాబట్టి 40 ఏళ్లు దాటిన తర్వత.. కచ్చితంగా బ్లడ్‌ షుగర్‌ చెక్‌ చేయించుకోవడం మంచిది. ఈ టెస్ట్‌ బ్రెక్‌ఫాస్ట్‌కు ముందు, ఆ తర్వాత చేయించుకోవాలి.

లిపిడ్‌ ప్రొఫైల్‌ టెస్ట్‌..

లిపిడ్‌ ప్రొఫైల్‌ టెస్ట్‌.. రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ ఎంత ఉన్నాయో చెప్తుంది. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకోవాలి. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోయి ఉంటే.. ఈ పరీక్ష ద్వారా మనకు తెలుస్తుంది. గుండె సమస్య, కిడ్నీ సమస్య, మధుమేహం ఉన్నవారు కచ్చితంగా లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి.

కోలనోస్కోపీ..

ఇది 40 ఏళ్లు పైబడిన పురుషులకు తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. స్త్రీలతో పోలిస్తే, పురుషుల్లో మధ్యవయస్సు తర్వాత పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మల విసర్జన సరిగా జరగని వారు పేగు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

ప్రొస్టేట్‌..

క్యాన్సర్‌ బారినపడిన ప్రతి ఎనిమిది మంది మగవారిలో ఒకరికి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నియంత్రించవచ్చు. 50 ఏళ్లు పైబడిన మగవాళ్లు ఏడాదికోసారి ప్రొస్టేట్‌ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఉంటే 40 ఏళ్ల నుంచే పరీక్షలు ప్రారంభించడం ఉత్తమం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *