Nara Lokesh: నారా లోకేష్‌కు షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు..!

పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు.   బంగారుపాళ్యం ఘటనపై నారా లోకేష్ (Nara Lokesh) సహా ఆరుగురిపై కేసు నమోదైంది. లోకేష్ సహా పలువురిపై బంగారుపాళ్యం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇతర టీడీపీ నేతలపై పలమనేరు సీఐ అశోక్కుమార్ ఫిర్యాదు చేశారు. నారా లోకేశ్ సహా మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నాని, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 353, 290, 188, 341 సెక్షన్ల కింద టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.

పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని, తమ విధులకు ఆటంకం కల్గించారని పోలీసులు టీడీపీ నేతలపై  ఆరోపణలు చేస్తున్నారు.  శుక్రవారం రోజున బంగారపాళ్యంలో లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ  ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బహిరంగ సభ జరుగకుండా పోలీసులు వాహనాలను సీజ్ చేశారు. దీంతో పక్కనే ఉన్న డాబా ఎక్కి లోకేశ్ ప్రజలతో మాట్లాడారు. పోలీసులు తీరును తప్పుబడుతూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు యువగళం వాహనాన్ని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది.

బంగారుపాళ్యం ఘటనపై టీడీపీ సీరియస్ అయింది. కొంతమంది పోలీస్ అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కయి యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక బంగారుపాళ్యం ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. కొంతమంది పోలీసు అధికారులు వైసీపీతో కుమ్మక్కై లోకేశ్ అడ్డుకుంటున్నారని లేఖలో ఆరోపించారు. డీఎస్ పీ సుధాకర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు యువగళం వాలంటీర్లను హింసిస్తున్నారని పేర్కొన్నారు.

మరికొందరు టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారని, చాలా మంది గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. పోలీసులపై తాము ఎక్కడ కేసు పెడతామోనని భయపడి.. తిరిగి తమపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నీచస్థాయికి పోలీసు అధికారులు దిగజారారన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు లోకేష్ వెంట నడుస్తున్నారన్నారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *