ఏదో జరుగుతోంది..! చైనా ఏదో చేస్తోంది..! అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు అమాంతం పెరుగుతుండడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. అమెరికా గగనతలంపై చైనా స్పై బెలూన్ ఎగురుతుండడంపై ఓవైపు రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగానే.. ఇంతలోనే మరో నిఘా బెలూన్ లాటిన్ అమెరికా గగనతలంలో చక్కర్లు కొడుతుండడం కలకలం రేపుతోంది. మరో హై ఆల్టిట్యూడ్ బెలూన్‌ను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ గుర్తించింది. లాటిన్ అమెరికా గగనతలంలో ఈ స్పై బెలూన్ ఎగురుతుందని అమెరికా చెబుతోంది. అది చైనాకు సంబంధించిన నిఘా బెలూన్‌గానే గుర్తించినట్లు పెంటగాన్ తెలిపింది.
అమెరికా-చైనా మధ్య టెన్షన్ టెన్షన్:
అటు మొదటి స్పై బెలూన్‌పై ఇరు దేశాల మధ్య రచ్చ ఆగడంలేదు. అమెరికా గగనతలంపై చైనా స్పై బెలూన్ ఎగురుతుండటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలను పెరిగాయి. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తన చైనా పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. అటు స్పై బెలూన్ వ్యవహారంపై చైనా స్పందించింది. ఈ అంశాన్ని అమెరికా అనవసరంగా రద్దాంతం చేస్తోందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో వింగ్ తెలిపారు. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా చెబుతుండగా.. డ్రాగన్ మాటలను అమెరికా నమ్మడం లేదు. బలమైన గాలులు కారణంగానే బెలూన్ నిర్ణీత మార్గందాటి బయటకు వచ్చిందన్నది చైనా వాదన. అయితే అమెరికా మాత్రం జాగ్రత్తగా ఉంటోంది. నిఘాను మరింత పటిష్టం చేసింది. ఇక ఇరు దేశాల సార్వభౌమాధికారాన్ని, గగనతల నిబంధనలు ఉల్లంఘించే ఉద్దేశం తమకు లేదని చైనా వాదిస్తొంది. అంతర్జాతీయ చట్టాలను అనుసరిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది. ఈ బెలూన్ వల్ల ఎవరికీ హాని జరగదని చెప్పింది.
నిజానికి ఈ బెలూన్‌ను పేల్చివేయాలని అమెరికా భావించింది. అధ్యక్షుడు బైడెన్ కూడా బెలూన్‌ను పేల్చేయాలని ఆదేశించారు. అయితే రక్షణ కార్యదర్శి మాత్రం వెనక్కి తగ్గారు. అలా చేయడం చాలా ప్రమాదకరమని ఆయన భావిస్తున్నారు. బెలూన్‌ను పేల్చివేస్తే దాని ద్వారా చెలరేగే మంటలు, బెలూన్ శిధిలాల వల్ల మాంటానాలోని ప్రజలకు హాని వాటిల్లే ప్రమాదముందని సమాచారం. బెలూన్ శిథిలాల వల్ల ప్రజలకు ఏమైనా ప్రమాదం తలెత్తే అవకాశం ఉండడంతో ఈ పేల్చివేయాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్లు బైడెన్‌కు రక్షణ కార్యదర్శి వివరించారు. దీంతో బైడెన్‌కు ఆయన చెప్పిన మాటలకు ఓకే అన్నారు. ఇక సున్నితమైన ప్రాంతాల్లో ఈ చైనా బెలూన్ తిరుగుతుందని.. దీని వల్ల అత్యంత గోప్యమైన సమాచారాన్ని చైనా చోరీ చేసే అవకాశముందని అమెరికా టెన్షన్ పడుతోంది.