కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మొదటి వందే భారత్ ట్రైన్ వచ్చింది. హైదరాబాద్ టు విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలును ప్రారంభించారు. అయితే ఈ రైలుపై వరుసగా దాడులు జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా మరోసారి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ సంఘటన ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.
అయితే, ఈ రాళ్ల దాడిలో సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించారు. రైల్వే అధికారులు ధ్వంసమైన గ్లాస్ ను విశాఖ స్టేషన్ లో మార్చారు. దీంతో రైలు ఆలస్యంగా బయలుదేరింది. ఉదయం 5:45 గంటలకు బయలుదేరాల్సిన 20833 రైలు 8:50 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. వందే భారత్ ట్రైన్. మూడు గంటల లేటు గా విశాఖ – సికింద్రాబాద్ ట్రైన్ పయనం కానుంది.
అయితే గతంలో కూడా వందే భారత్ ట్రైన్ పై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇక గతనెలలో కంచెరపాలెంవద్ద వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రామ్మూర్తి పంతులు పేట గేట్ దగ్గర రాళ్లతో అగంతకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. కంచరపాలెంలో నిలిపి ఉంచిన వందేభారత్ ట్రైన్ పై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వందే భారత్ రైలు రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి.