అదొక్కటే మార్గం.. మూడు రాజధానులపై సజ్జల కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులే మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆదివారం సజ్జల దర్శించుకున్నారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇతర ప్రయోజనాలు రావాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు రాజధానులు ఉంటేనే.. రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లోనూ దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఆదర్శవంతమైన రాష్ట్రంగా కొనసాగుతోందన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి.. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని సజ్జల పేర్కొన్నారు. సీఎం జగన్‌కు వెయ్యి రెట్లు ప్రజాదరణ పెరిగిందన్నారు.

ఇక, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకుల తీరుపై సజ్జల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే కొందరు ఓర్వ లేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, ప్రభుత్వం నిబంధనల ప్రకారమే అనుమతులు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే విషం కక్కుతున్నారని, ఏ పెట్టుబడి వచ్చినా సీఎం జగన్‌కు బంధువులని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి పెట్టుబడులు రాకూడదన్నదే చంద్రబాబు అనుకూల మీడియా తాపత్రయమని, బరితెగించి తప్పుడు రాతలు రాస్తున్నారని సజ్జల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఆదాయం రాకూడదన్నదే వారి లక్ష్యమని ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు తమను బాధ్యుల్ని చేస్తున్నారని సజ్జల ఫైరయ్యారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *