అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో మార్పు తెస్తం: కేసీఆర్

అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో మార్పు తెస్తం: కేసీఆర్ దేశంలో మార్పు రావాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. 75 ఏండ్లు అయినా దేశంలో నీళ్ల కోసం ఇంకా గొడవలు జరుగుతున్నాయిని చెప్పారు. దేశంలో అవసరానికి మించి జల సంపద ఉందని..అయినా వాటిని ఉపయోగించుకునేలా కేంద్రం పాలసీ  తేవడం లేదన్నారు. రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయదన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి 20 ఏండ్లు అయితున్నా..ఇంత వరకు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టలేదన్నారు. దేశంలో తాగునీటి కోసం ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  దేశంలో మరో 50 ఏండ్ల వరకు కూడా తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు లేవని కేంద్ర వాటర్ కమిషన్ ప్రకటించిందని..అయినా..కేంద్రం చేతకాని తనం వల్ల సాగునీరు, తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.  ఇప్పటికీ రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం యుద్దాలు జరగాలా ? అని ప్రశ్నించారు. మోడీకి అదానీపై ఉన్న ప్రేమ దేశ ప్రజలపై లేదా అని ప్రశ్నించారు. అదానీ ఇష్యూతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందన్నారు. 

భారీ ప్రాజెక్టులు ఎందుకు కట్టరు..?

చైనా, రష్యా, ఈజిప్టు వంటి దేశాల్లో వేల టీఎంసీల కెపాసిటీతో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని..కానీ దేశంలో అలాంటి ప్రాజెక్టు ఒక్కటీ లేదని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో అధికారంకి వచ్చేందుకు గతంలో అనేక పార్టీలు అబద్దాలతో ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. దేశంలో వాటర్ పాలసీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అధికారంలోకి వస్తే వాటర్ పాలసీలో మార్పులు తెస్తామని…అదే బీఆర్ఎస్ పార్టీ నినాదమని చెప్పారు. దేశంలో సాగునీరు లేక ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నానా పాటేకర్ వంటి సినిమా స్టార్లు సహాయం చేశారని గుర్తు చేశారు. సాగునీరు, కరెంట్ అందక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రం తమాషా చూసినట్లు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పవర్ పాలసీ, వాటర్ పాలనీ, ఇరిగేషన్ పాలసీలను మారుస్తామన్నారు. 

కరెంట్ ఎందుకివ్వడం లేదు..?

దేశంలో  24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఎందుకు జరగడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో రెండేళ్లలోనే 24 గంటల విద్యుత్ ను సరఫరా చేశామన్నారు. లండన్, న్యూయార్క్ లో కరెంట్ పోయినా..హైదరాబాద్ లో కరెంట్ పోదన్నారు. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చామన్నారు. దేశంలో 4 లక్షల 10 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని చెప్పారు. కానీ కేంద్రం ఇప్పటి వరకు అత్యధికంగా 2 లక్షల 15వేల మెగా వాట్ల విద్యుతే ఉత్పత్తి చేసిందన్నారు. ఎక్కడా కూడా దేశంలో 24 గంటల విద్యుత్ ప్రజలకు అందడం లేదన్నారు.  కొన్ని  రాష్ట్రాల్లో రెండు మూడు గంటలు కూడా కరెంట్ ఉండదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కేంద్రం మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తుందని..చేతల్లో మాత్రం ఏమీ ఉండదన్నారు. దేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. రోడ్లు, ఎయిర్ పోర్టులు, వ్యవసాయం, పోర్టులు వంటి అనేక రంగాల్లో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో గూడ్స్ రైలు యావరేజ్ స్పీడ్ 24 కిలో మీటర్లు ఉంటే..చైనాలో 120 కి. మీ. ఆస్ట్రేలియాలో 80 కి. మీ, అమెరికాలో 75 కి.మీ ఉందన్నారు. ఇండియన్ ట్రక్ స్పీడ్ 50 కి.మీ ఉంటే..చైనాలో 70 కి. మీగా ఉందన్నారు. గూడ్స్, ట్రక్ స్పీడులోనూ విదేశాలతో పోటీ పడలేకపోవడం దారుణమన్నారు. మోడీ ప్రభుత్వం విద్యుత్ ను ప్రైవేటు పరం చేసినా..తాము అధికారంలోకి వచ్చాక జాతీయం చేస్తామన్నారు. 

దేశంలో కొత్త దందా నడుస్తుంది..

ప్రధాని మోడీకి అదానీ మీద ఉన్న ప్రేమ ప్రజలపై లేదని కేసీఆర్ అన్నారు. అందుకే నష్టాలొస్తే ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని..లాభాలొస్తే ప్రైవేటుకు అప్పగిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. దేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని..125 ఏండ్ల పాటు బొగ్గు ఉత్పత్తి చేసుకునే ఛాన్సుందన్నారు. కానీ ఇప్పటికే విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. బొగ్గు నిల్వలున్న ప్రాంతానికి రైల్వే లైన్లు వేయరని..కావాలని లైన్ల నిర్మాణంలో జాప్యం చేస్తారన్నారు. మోడీకి ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు పరం చేసే దానిమీదున్న శ్రద్ధం..ప్రభుత్వ కంపెనీలను లాభాల్లోకి తీసుకురావాలన్న దానిపై లేదన్నారు. గతంలో ఎయిరిండియా టాటా చేతుల్లో ఉండేదని..స్వాతంత్య్రం వచ్చాక ఎయిరిండియా కేంద్రం ఆధీనంలోకి వెళ్లిందన్నారు. ఇప్పుడు తిరిగి టాటాకు కట్టబెట్టారని చెప్పారు. అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో మార్పులు తెస్తామన్నారు. 

మహిళలకు ప్రాధాన్యం..

దేశంలో బీఆర్ఎస్ సర్కారు వస్తే మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. దేశంలో ప్రతీ అసెంబ్లీ, కౌన్సిల్,  పార్లమెంట్ లో సీట్లు పెంచుతామని..వాటిని  మహిళలకు కేటాయిస్తామన్నారు. ఏడాదిలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేవపెట్టిన భేటీ పడావో భేటీ బచావో స్కీం ఏమైందని ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందన్నారు. చైనా నుంచి అనేక కంపెనీలు తరలివెళ్తున్నాయని..మరి వాటిని కేంద్రం ఎందుకు ఆకర్షించడం లేదన్నారు. భారత్ రాష్ట్ర సమితి ఒక మిషన్ అని….మిషన్ మోడ్ లో పనిచేస్తుందన్నారు. బీఆర్ఎస్ వచ్చే వరకు దేశంలో మార్పు రాదన్నారు.  

    ©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *