ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో శుభవార్త అందింది. రాష్ట్రానికి మరో నేషనల్ హైవే రానుంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు కొత్త హైవేల నిర్మాణానికి, 11 హైవేలకు జాతీయ హోదా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అనుమతులు ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఏపీకి మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్‌హెచ్ బి 365 నిర్మాణానికి కేంద్ర అనుమతులు పూర్తిస్థాయిలో రావడంతో ఎన్‌హెచ్‌ఏఐ రహదారి నిర్మాణానికి సన్నాహాలు మొదలు పెట్టింది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మీదుగా ఈ కొత్త జాతీయ రహదారి త్వరలోనే నిర్మాణం కానుంది. ఈ నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లను ఎన్‌హెచ్‌ఏఐ వేగవంతం చేసింది.
కొత్తగా నిర్మించనున్న ఈ రహదారి ఏలూరు జిల్లా జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం, కన్నాపురం మీదుగా తూర్పు గోదావరి జిల్లా దొండపూడి, పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు మండలాలను అనుసంధానం చేస్తూ నిర్మాణం కానుంది. మొత్తం 86.7 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. గతంలోనే కొంతమేరకు భూ సేకరణ ప్రక్రియ జరిగినప్పటికీ అది పూర్తి కాకపోవడంతో తాజాగా మళ్లి సన్నాహాలు మొదలుపెట్టారు.
రహదారి నిర్మాణం కానున్న గ్రామాల్లో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పర్యటిస్తూ గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను ముగించి బాధితులకు పరిహారం అందించే దిశగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు పూర్తిస్థాయిలో అనుమతులు రావడంతో ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. రానున్న రెండు నెలల్లో భూ సేకరణ ప్రక్రియ ఒకవైపు పూర్తిచేస్తూనే ఈ గడువు లోగానే గ్రామాల వారీగా బాధితులకు పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతేకాదు.. కొత్తగా నిర్మిస్తున్న హైవేలకు సంబంధించి కొన్ని గ్రామాల్లో జనాభా ఆధారం గా నిర్మాణాలను చేపట్టనుంది. కొన్ని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న రోడ్లను జాతీయ రహదారులకు అనుగుణంగా పూర్తిస్థాయిలో వెడల్పు చేయడంతో పాటు ఆధునీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరికొన్ని గ్రామాల మీదుగా ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలను ఎన్‌హెచ్‌ఏఐ చేసింది.