పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నారని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తవణంపల్లి వద్ద లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ బయటికి వస్తే పరదాల మాటున ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలని చూస్తేనే సీఎం జగన్ భయపడుతున్నారని.. ఇక, సీబీఐని చూస్తే వణికిపోతున్నారని సెటైర్లు వేశారు. యువత భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా.. సైకో పోయి, సైకిల్ రావాలని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇక, వైసీపీ పాలనలో నాడు- నేడు అంటూ హడావిడి చేయడం తప్ప అభివృద్ధి లేదని లోకేష్ అన్నారు. ప్రజల్లోకి వచ్చినందుకు తనపై కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి లోకేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న కొడాలి నాని.. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇక, వైసీపీ ప్రభుత్వం ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులను టీడీపీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో ఎత్తి వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్‍కే దక్కిందన్నారు.